e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home స్పోర్ట్స్ ఓటమితో షురూ

ఓటమితో షురూ

  • తొలి టీ20లో భారత్‌ పరాజయం
  • 8 వికెట్లతో నెగ్గిన ఇంగ్లండ్‌

టాపార్డర్‌ వైఫల్యానికి టీమ్‌ఇండియా మూల్యం చెల్లించుకుంది. ముంచినా తేల్చినా మొదటి ముగ్గురే అన్నట్లు.. టాప్‌-3 ఆటగాళ్లు ఐదు పరుగులకే ఔటవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్‌ పేసర్ల విజృంభణకు 2/1.. 3/2.. 20/3.. 48/4 ఇలా వరుసగా వికెట్లు కోల్పోయింది. వచ్చినవాళ్లు వచ్చినట్లు వెనుతిరుగుతున్న సమయంలో శ్రేయస్‌ అయ్యర్‌ కాసేపు పోరాడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించగా.. సునాయాస లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 

అహ్మదాబాద్‌: బ్యాట్స్‌మెన్‌ బాధ్యతారాహిత్యానికి.. బౌలర్ల అలసత్వం తోడవడంతో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా ఓటమి పాలైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (48 బంతుల్లో 67; 8 ఫోర్లు, ఒక సిక్సర్‌) ఒక్కడే అర్ధశతకంతో ఆకట్టుకోగా.. మిగిలినవాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఓపెనర్లు జాసన్‌ రాయ్‌ (49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (28; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌) దంచి కొట్టడంతో ఇంగ్లండ్‌ 15.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 130 పరుగులు చేసింది. ఇరు జట్ల మధ్య ఆదివారం  రెండో టీ20 జరుగనుంది. 

ఒకరి వెంట ఒకరు..

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. ఆర్చర్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో లోకేశ్‌ రాహుల్‌ (1) బంతిని వికెట్ల మీదకు ఆడుకొని ఔటయ్యాడు. అయితే మరుసటి ఓవర్‌లో భారత్‌కు అసలైన దెబ్బ తగిలింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (0) ఐదు బంతులు ఎదుర్కొని ఖాతా తెరువకుండానే ఔటయ్యాడు.   ధావన్‌ (4)ను మార్క్‌ వుడ్‌ తన పేస్‌తో దెబ్బకొట్టాడు.  ఫలితంగా పవర్‌ ప్లే ముగిసేసరికి భారత్‌ 22/3తో నిలిచింది. టీ20ల్లో భారత్‌కు ఇది పవర్‌ప్లేల్లో రెండో అత్యల్ప స్కోరు. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా రిషబ్‌ పంత్‌ (21) మాత్రం తనదైన శైలిలో  ఆడుతూ ముందుకు సాగాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు.. ఆర్చర్‌ బౌలింగ్‌లో కండ్లుచెదిరే రివర్స్‌ స్కూప్‌ సిక్సర్‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. మరో భారీ షాట్‌కు యత్నించిన పంత్‌ క్యాచ్‌ ఔటై పెవిలియన్‌ చేరాడు. ఫలితంగా సగం ఇన్నింగ్స్‌ ముగిసే సరికి కోహ్లీసేన 48/4తో నిలిచింది.

అతనొక్కడే..

ఆరంభంలోనే ప్రధాన వికెట్లు కోల్పోవడంతో హార్దిక్‌ పాండ్యా (19)తో కలిసి శ్రేయస్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జంట చెత్త బంతులను బౌండ్రీలకు తరలించింది. స్టోక్స్‌ ఓవర్‌లో పాండ్యా 6,4 బాదితే.. ఆర్చర్‌కు అయ్యర్‌ రెండు ఫోర్లు అరుసుకున్నాడు. ఈ క్రమంలో అయ్యర్‌ 37 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే ఆర్చర్‌ వరుస బంతుల్లో పాండ్యా, శార్దూల్‌ (0)ను ఔట్‌ చేసి భారత్‌ను దెబ్బకొట్టాడు. చివర్లో ఇంగ్లండ్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో పరుగులు నియంత్రించగా.. అయ్యర్‌ ఆఖరి ఓవర్‌లో ఔటయ్యాడు.  

ఆడుతూ పాడుతూ..

సునాయాస లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ చెలరేగిపోయింది. ఓపెనర్లు జాసన్‌ రాయ్‌, జోస్‌ బట్లర్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడటంతో ఇంగ్లిష్‌ జట్టు ఛేజింగ్‌ సాఫీగా సాగింది. స్పిన్నర్‌, పేసర్‌ అనే తేడా లేకుండా ఇంగ్లండ్‌ ఆటగాళ్లు దంచికొట్టడంతో లక్ష్యం మంచులా కరిగిపోయింది. తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించాక బట్లర్‌ ఔట్‌ కాగా.. అర్ధశతకానికి ఒక పరుగు దూరంలో రాయ్‌ పెవిలియన్‌ చేరాడు. అయినా మలన్‌ (24 నాటౌట్‌), బెయిర్‌స్టో (26 నాటౌట్‌) ధాటిగా ఆడటంతో ఇంగ్లండ్‌ అలవోకగా గెలుపొందింది. 

స్కోరు బోర్డు

భారత్‌: ధావన్‌ (బి) వుడ్‌ 4, రాహుల్‌ (బి) ఆర్చర్‌ 1, కోహ్లీ (సి) జోర్డాన్‌ (బి) రషీద్‌ 0, పంత్‌ (సి) బెయిర్‌స్టో (బి) స్టోక్స్‌ 21, శ్రేయస్‌ (సి) మలన్‌ (బి) జోర్డాన్‌ 67, పాండ్యా (సి) జోర్డాన్‌ (బి) ఆర్చర్‌ 19, శార్దూల్‌ (సి) మలన్‌ (బి) ఆర్చర్‌ 0, సుందర్‌ (నాటౌట్‌) 3, అక్షర్‌ (నాటౌట్‌) 7, ఎక్స్‌ట్రాలు: 2, మొత్తం: 20 ఓవర్లలో 124/7. వికెట్ల పతనం: 1-2, 2-3, 3-20, 4-48, 5-102, 6-102, 7-117, బౌలింగ్‌: రషీద్‌ 3-0-14-1, ఆర్చర్‌ 4-1-23-3, వుడ్‌ 4-0-20-1, జోర్డాన్‌ 4-0-27-1, స్టోక్స్‌ 3-0-25-1, కరన్‌ 2-0-15-0. 

ఇంగ్లండ్‌: రాయ్‌ (ఎల్బీ) సుందర్‌ 49, బట్లర్‌ (ఎల్బీ) చాహల్‌ 28, మలన్‌ (నాటౌట్‌) 24, బెయిర్‌స్టో (నాటౌట్‌) 26, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 15.3 ఓవర్లలో 130/2. వికెట్ల పతనం: 1-72, 2-89, బౌలింగ్‌: అక్షర్‌ 3-0-24-0, భువనేశ్వర్‌ 2-0-15-0, చాహల్‌ 4-0-44-1, శార్దూల్‌ 2-0-16-0, పాండ్యా 2-0-13-0, సుందర్‌ 2.3-0-18-1.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఓటమితో  షురూ

ట్రెండింగ్‌

Advertisement