IPL Mega Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం అంటే చాలు ఫ్రాంచైజీలతో పాటు అభిమానుల్లో ఎక్కడ లేని ఆసక్తి ఉంటుంది. వేలంలో ఏ ఫ్రాంచైజీ ఎవరిని కొంటుంది? రికార్డు ధర పలికేది ఎవరు? .. అనే ప్రశ్నలు ప్రతిఒక్కరి బుర్రలో తిరుగుతాయి. ఇక మెగా వేలం గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఎందుకంటే.. ప్రతి ఫ్రాంచైజీకి కొత్త స్క్వాడ్‌ను ఎంపిక చేసుకొనే సువర్ణావకాశం ఇది. 18వ సీజన్ కోసం నవంబర్ 24, 25వ తేదీల్లో జెడ్డా వేదికగా మెగా వేలం జరుగనుంది. కాబట్టి ప్రతిభావంతులైన క్రికెటర్లను కొనేందుకు ఫ్రాంచైజీలు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహకులు వేలం గురించి ఆసక్తికర విషయం వెల్లడించారు.
ఐపీఎల్ మెగా వేలాన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మార్చేందుకు స్టార్ ఆటగాళ్లను రెండు గ్రూప్‌లుగా విభజించనున్నారు. రూ.2 కోట్ల కనీస ధరకు పేరు రిజిస్టర్ చేసుకున్న వాళ్లలో కొందరిని ఎలైట్ గ్రూప్ సభ్యులుగా పేర్కొంటూ.. వాళ్లను రెండు వర్గాలుగా విభజించి వేలం జరపాలనేది నిర్వాహకుల ఆలోచన. ఇదే విషయాన్ని వాళ్లు 10 ఫ్రాంచైజీల యజమానులకు తెలియజేశారు.
అయితే.. ఏ గ్రూప్‌లో ఎంతమంది ఉంటారు? అనేది మాత్రం చెప్పలేదు. వేలానికొచ్చే ప్రముఖ క్రికెటర్లను గ్రూప్‌లుగా చేయడం ఇదే మొదటిసారి కాదు. 2014లో, ఆపై 2018లో ఇలానే రెండు వర్గాలుగా చేసి వేలం నిర్వహించారు. అయితే.. 2022 మినీ వేలంలో మాత్రం ఒకే గ్రూప్‌గా వేలం పాట పూర్తి చేశారు.
నవంబర్ 24, 25వ తేదీల్లో జరుగబోయే ఐపీఎల్ మెగా వేలంలో ఎలైట్ గ్రూప్ సభ్యులు మొదట అమ్ముడుపోయే వీలుంది. ఇంతకూ ఈ గ్రూప్‌లో ఉండేది ఎవరంటే.. రిషభ్ పంత్ (Rishabh Pant), కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, షమీ, అర్ష్‌దీప్ సింగ్, అశ్విన్, మిచెల్ స్టార్క్, జోస్ బట్లర్.. తదితరులు ఉండే అవకాశముంది.
ఈసారి వేలంలో 1,578 క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. వీళ్లలో క్యాప్డ్ భారత క్రికెటర్లు 48 మంది, అన్క్యాప్డ్ ఆటగాళ్లు 272 మంది ఉండగా.. అనుబంధ దేశాల నుంచి 30 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక 152 మంది అన్క్యాప్డ్ భారత క్రికెటర్లు, అన్‌క్యాప్ట్ అంతర్జాతీయ ఆటగాళ్లు ముగ్గురు వేలంలో పాల్గొంటున్నారు. ఈసారి అన్ని ఫ్రాంచైజీల కంటే పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా 110.5 కోట్లు ఉన్నాయి. దాంతో, ఆ ఫ్రాంచైజీ రికార్డు ధరకు స్టార్ ఆటగాళ్లను సొంతం చేసుకునే అవకాశం ఉంది.