Festive Season – Car Sales | భారతీయులు పండుగల సమయంలోనే తమకు ఇష్టమైనవీ, కుటుంబానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా స్పేసియస్గా, కంఫర్టబుల్గా ఉండే కార్లపై మోజు పెంచుకుంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగల సీజన్లో కార్లు, ద్విచక్ర వాహనాల విక్రయాలు 12 శాతం పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ రావడంతో ద్విచక్ర వాహనాలు పుంజుకున్నాయని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) తెలిపింది.
పండుగల సీజన్ సందర్భంగా గత నెల మూడో తేదీ నుంచి ఈ నెల 13 వరకూ 43 లక్షల యూనిట్ల కార్లు, ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. 2023 ఫెస్టివ్ సీజన్లో 38 లక్షల వాహనాలను విక్రయించారు డీలర్లు. దక్షిణ భారతావనిలో ప్రత్యేకించి ఒడిశాలో కురిసిన అకాల భారీ వర్షాల వల్ల 45 లక్షల వాహనాలు విక్రయించాలన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని ఫాడా తెలిపింది. డీలర్లు అసాధారణ రీతిలో డిస్కౌంట్లు ఆఫర్ చేయడంతో ద్విచక్ర వాహనాల విక్రయాల్లో సుమారు 14 శాతం, కార్ల విక్రయాల్లో ఏడు శాతం గ్రోత్ రికార్డయింది.
గత నెలలో ఫెస్టివ్ సీజన్ కావడంతో కార్ల విక్రయాలు 32.4 శాతం పెరిగాయి. అందునా ఎస్యూవీ కార్లు, కొత్త ఆవిష్కరించిన మోడల్ కార్లకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. కానీ, పాత మోడల్ కార్ల నిల్వలు మాత్రం భారీగానే కొనసాగుతున్నాయని ఇంతకు ముందే ఫాడా తెలిపింది. ఇన్వెంటరీ లెవల్స్ పెరుగుదల కార్ల విక్రయాలు తగ్గుతున్నాయని సంకేతమిస్తున్నాయి. దీంతో షోరూమ్ ఓనర్లు భారీగా డిస్కౌంట్లు ఆఫర్ చేయడంతో సేల్స్ పెరిగాయని ఫాడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నే్శ్వర్ తెలిపారు.