Natural Remedies For Immunity | మన శరీర రోగ నిరోధక వ్యవస్థ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుంది. శరీరంలోకి చేరే క్రిములను ఎప్పటికప్పుడు నాశనం చేస్తుంది. అయితే రోగ నిరోధక వ్యవస్థ పనితీరు సరిగ్గా లేనివారు, ఇమ్యూనిటీ తక్కువా ఉన్నవారు తరచూ రోగాల బారిన పడుతుంటారు. ఎందుకంటే క్రిములు శరీరంలోకి ప్రవేశించిన తరువాత రోగ నిరోధక శక్తి కణాలు సరిగ్గా పనిచేయవు. లేదా కణాలు తగిన సంఖ్యలో ఉండవు. దీంతో శరీరం ఇన్ఫెక్షన్ లేదా రోగానికి వ్యతిరేకంగా పోరాడలేకపోతుంది. దీని వల్ల వ్యాధి తీవ్రత ఎక్కువవుతుంది. అయితే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఎలాంటి రోగాలు రావు. క్రిములు మన శరీరంలోకి చేరగానే వెంటనే రోగ నిరోధక వ్యవస్థ చంపేస్తుంది. కనుక క్రిములను చంపేందుకు గాను ఇమ్యూనిటీని పెంచే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. నిమ్మకాయలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఉదయం నిమ్మకాయ నీళ్లను తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. నిమ్మరసం తాగడం వల్ల మన శరీరంలోకి క్రిములు చేరగానే వెంటనే రోగ నిరోధక వ్యవస్థ యాక్టివేట్ అయి క్రిములను చంపేస్తుంది. దీంతో రోగాలు రాకుండా ఉంటాయి. అందువల్ల రోజూ నిమ్మరసం తాగాలి. లవంగాల్లో యూజినాల్ అనే సమ్మేళణం ఉంటుంది. ఇది యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటుంది.
లవంగాలను మనం తరచూ మసాలా వంటల్లో వేస్తుంటాం. ఇవి ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షిస్తాయి. ముఖ్యంగా లవంగాలను తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, వాపులు, మంట ఉండవు. బాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడడంలో లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి. అందువల్ల రోజూ లవంగాలను కూడా తింటుండాలి. పసుపులో కర్క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. దీన్ని మనం రోజూ వంటల్లో వేస్తూనే ఉంటాం. పసుపును పాలలో కలిపి తాగితే బాక్టీరియా, వైరస్ ల నుంచి రక్షణ లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని వాపులు తగ్గిపోతాయి.
వెల్లుల్లిలో ఆల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సహజసిద్ధమైన యాంటీ బయోటిక్‌లా పనిచేస్తుంది. బ్యాక్లీరియా, వైరస్‌లను ఇది నాశనం చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్లు రావు. అల్లంలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల అల్లం రసాన్ని తాగితే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. గొంతు నొప్పి, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు రోజూ తీసుకునే ఆహారంలో అల్లంను ఎలా అయినా తీసుకోవచ్చు. దీని వల్ల జలుబు నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. అల్లంను తీసుకుంటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగాల బారి నుంచి రక్షణ లభిస్తుంది.
ఆయుర్వేదంలో తులసికి ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. ఇందులో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల తులసి ఆకులతో తయారు చేసిన టీని తాగాలి. దీంతో ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. జ్వరం తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పరుగుతుంది. దగ్గు, జలుబును తగ్గించడంలో తులసి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. తేనెలో సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. తేనెను ఎంతో పురాతన కాలం నుంచే ఔషధంగా ఉపయోగిస్తున్నారు. తేనెను తీసుకోవడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గాయాలపై తేనెను రాస్తే అవి త్వరగా మానుతాయి. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవచ్చు. దీంతో సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.