Canada Open : భారత సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth) కెనడా ఓపెన్ సూపర్ 300లో దుమ్మురేపుతున్నాడు. తొలి రౌండ్ నుంచి అద్భుతంగా ఆడుతున్న అతడు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్‌లో వాంగ్ పో వీ (చైనీస్ తైపీ)కి షాకిచ్చాడు. తొలి సెట్లో మొదట వెనకబడినా.. ఆ తర్వాత పుంజుకున్న శ్రీకాంత్ ప్రత్యర్థి ఆట కట్టించాడు.
తొలి సెట్‌ను 21-19తో గెలుపొందిన జోష్‌తో రెండో సెట్లోనూ చెలరేగిపోయాడు. అంతే.. వాంగ్ చేతులెత్తేశాడు. 21-12తో విజయం సాధించిన శ్రీకాంత్ దర్జాగా క్వార్టర్ ఫైనల్లో కాలుపెట్టాడు. సెమీస్ స్థానం కోసం భారత బ్యాడ్మింటన్ స్టార్ చైనీస్ తైపీకి చెందిన చౌ థియెన్ చెన్ను ఢీకొట్టే అవకాశముంది.
ఈ మధ్యే మలేషియా ఓపెన్ (Malaysia Open) ఫైనల్ చేరిన శ్రీకాంత్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. చైనీస్ షట్లర్ లీ షీ ఫెంగ్ ధాటికి భారత స్టార్ నిలవలేకపోయాడు. తొలి సెట్‌ను 11-21తో కోల్పోయిన అతడు.. రెండో సెట్లో కనీసం పోరాటం చేయలేక చేతులెత్తేశాడు.