రావల్పిండి : పాకిస్థాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెటర్లు ఆ దేశాన్ని వీడొద్దని, షెడ్యూల్ ముగిసేంతవరకూ అక్కడే ఉండాలని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ఆ దేశ ఆటగాళ్లను ఆదేశించింది. ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి నేపథ్యంలో తొలి వన్డే ముగిసిన తర్వాత లంక క్రికెటర్లలో సుమారు 8 మంది ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోతామని జట్టు మేనేజ్మెంట్ను కోరినా అందుకు ఎస్ఎల్సీ అంగీకరించలేదు. వన్డే సిరీస్‌తో పాటు ముక్కోణపు సిరీస్‌నూ ముగించుకున్నాకే స్వదేశానికి రావాలని వారిని ఆదేశించింది. తమ మాటను ధిక్కరించి పాక్‌ను వీడితే వారు కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. ఒకవేళ వాళ్లు వచ్చినా బెంచ్‌లో ఉన్న ఆటగాళ్లతో అయినా సిరీస్‌ను కొనసాగిస్తామని తెలిపింది.
ఇదిలాఉండగా ఇస్లామాబాద్ ఘటనతో వన్డే సిరీస్‌తో పాటు ముక్కోణపు సిరీస్ (పాక్, లంక, జింబాబ్వే) షెడ్యూల్‌నూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సవరించింది. గురువారం, శనివారం జరగాల్సిన మిగిలిన రెండు వన్డేలను 14, 16 తేదీలకు మార్చింది. ఇక ఈనెల 17 నుంచి ఆరంభమవ్వాల్సిన ట్రై సిరీస్ 18 నుంచి మొదలుకానుంది. మ్యాచులన్నీ రావల్పిండి వేదికగానే జరుగుతాయి. ఈ టోర్నీకి లాహోర్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా భద్రతా కారణాల దృష్ట్యా సిరీస్‌ను రావల్పిండికి మార్చడం గమనార్హం.