IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మరో విజయంపై కన్నేసింది. లక్నో సూపర్ జెయింట్స్(LSG) నాకౌట్ ఆశలపై నీళ్లు చల్లిన ఆరెంజ్ ఆర్మీ.. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతోంది. వర్షం ముప్పు కారణంగా లక్నో వేదికగా ఇరుజట్లు ఎదురుపడనున్నాయి. టేబుల్ టాపర్‌గా నిలవాలనుకుంటున్న ఆర్సీబీకి చెక్ పెట్టాలని కమిన్స్ బృందం పట్టుదలతో ఉంది.
లీగ్ దశలో ఇరుజట్లుకు ఇది రెండో మ్యాచ్. ఏప్రిల్ 25న ఉప్పల్ మైదానంలో 35 పరుగులతో గెలుపొందిన బెంగళూరు.. ఈసారి కూడా విజయంపై ధీమాగా ఉంది. అయితే.. కరోనా బారిన పడడంతో లక్నో మ్యాచ్‌కు దూరమైన ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) కోలుకోవడం హైదరాబాద్‌కు ప్లస్ కానుంది. నెట్స్‌లో పెద్ద షాట్లు ఆడుతూ కనిపించిన ఈ హిట్టర్‌కు తుది జట్టులో ఉంటాడా? లేదా? అనేది తెలియదు. ఒకవేళ. .అతడికి విశ్రాంతి ఇవ్వాలనుకుంటే అథర్వ తైడే ఎలాగూ ఉండనే ఉన్నాడు.
— SunRisers Hyderabad (@SunRisers) May 23, 2025
ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. శుక్రవారం సన్‌రైజర్స్‌పై గెలిస్తే.. 19 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్‌ను రజత్ పాటిదార్ జట్టు కిందికి నెట్టేస్తుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షార్ఫణం కావడంతో హైదరాబాద్ మ్యాచ్‌లో చెలరేగిపోవాలని ఆర్సీబీ భావిస్తోంది. ప్లే ఆఫ్స్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ లభిస్తుందని అనుకుంటున్న బెంగళూరుకు సన్‌రైజర్స్ షాకిచ్చినా ఇవ్వొచ్చు. ఎందుకంటే.. సంచలన ఆటకు మారుపేరైన ఆరెంజ్ ఆర్మీతో అంత ఈజీ కాదని ఆ జట్టుకు బాగా తెలుసు.
నిరుడు చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ ఓపెనర్ల ధాటికి ఆర్సీబీ బౌలర్లు కుదేలయ్యారు. ట్రావిస్ హెడ్ (102) మెరుపు శతకంతో విజృంభిస్తే.. అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్(67)ల విధ్వంసంతో ఆర్సీబీ బౌలర్లు నీరుగారిపోయారు. వీళ్లిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కమిన్స్ సేన ఐపీఎల్ చరిత్రను తిరగరాస్తూ 287 పరుగులతో సరికొత్త రికార్డు నెలకొల్పింది.
అభిషేక్ శర్మ, హెడ్
అందుకే.. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా.. భారీ స్కోర్ ఖాయమని, రికార్డులు బద్ధలవుతాయని ఫ్యాన్స్ అనుకుంటారు. అయితే.. బెంగళూరకు కూడా విరాట్ కోహ్లీ భీకర ఫామ్‌లో ఉన్నాడు. మ్యాచుల్లో 6 అర్ధ శతకాలు బాదిన విరాట్.. కుదురుకున్నాడంటే హైదరాబాద్ బౌలర్లను ఉతికేయడం ఖాయం. ఫిలిప్ సాల్ట్, దేవ్‌దత్ పడిక్కల్, రజత్.. డెత్ ఓవర్లలో టిమ్ డేవిడ్‌లను కట్టడి చేయడంపై సన్‌రైజర్స్ విజయం ఆధారపడనుంది.
సన్‌రైజర్స్‌కు ఈ సీజన్లో బ్యాటింగే బలం అన్నది అందరికీ తెలిసిందే. ఛేజింగ్ అయినా.. తొలుత బ్యాటింగ్ అయినా టాపార్డర్ చెలరేగారంటే కమిన్స్ సేనను అడ్డుకోవడం ఆర్సీబీకి కష్టమే. మిడిల్ ఓవర్లలో అద్భుతంగా ఆడుతున్న క్లాసెన్, కమిందు మెండిస్. అనికేత్ వర్మలు మరోసారి బ్యాట్ ఝులిపిస్తే.. హైదరాబాద్ ప్రత్యర్థికి గట్టి సవాల్ విసరడం పక్కా. బౌలింగ్ విషయానికొస్తే.. ఈషన్ మలింగ(8 వికెట్లు), యువ స్పిన్నర్ జీషన్ అన్సారీ (6 వికెట్లు)లు మాత్రమే నిలకడగా రాణిస్తున్నారు.
ఈషన్ మలింగ, జీషన్ అన్సారీ
బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆర్సీబీని తక్కువ స్కోర్‌కే కట్డడి చేయాలంటే.. సీనియర్లు హర్షల్ పటేల్, కమిన్స్, ఉనాద్కాట్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిందే. మొత్తంగా చూస్తే.. ఇప్పటివరకూ ఆర్సీబీ, హైదరాబాద్ 14 సార్లు తలపడ్డాయి. వీటిలో 13 పర్యాయాలు ఆరెంజ్ ఆర్మీ గెలుపొందగా.. బెంగళూరు 11 విజయాలకే పరిమితమైంది. కానీ, గత ఐదు మ్యాచుల్లో 3 విక్టరీలతో ఆ జట్టు ఆధిక్యం కనబరిచింది.