Supreme Court | బెట్టింగ్ యాప్‌లను నిషేధించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ విషయంలో స్పందన చెప్పాలని కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్ కారణంగా పిల్లలను కోల్పోయిన లక్షలాది మంది పిల్లల తరఫున కోర్టుకు వచ్చానని కేఏ పాల్ పేర్కొన్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను నిషేధించాలని.. లేకపోతే నియంత్రించాలని కేఏ పాల్ పిటిషన్లో కోరారు. ఈ యాప్‌ల ద్వారా జూదాన్ని ప్రోత్సహిస్తున్నారని.. యువత జీవితాలు నాశనమవుతున్నాయని పేర్కొన్నారు.
25 మందికి పైగా బాలీవుడ్, టాలీవుడ్ నటులతో పాటు ఇన్ఫ్లుయెన్సర్లు ఇందులో పాల్గొన్నారని.. ఎఫ్ఐఆర్లు దాఖలైనట్లుగా పేర్కొన్నారు. యువతను బెట్టింగ్ యాప్స్ తప్పుదారి పటిస్తున్నాయన్న ఆయన.. వారిని ఆర్థికంగా, మానసికంగా నాశనం చేస్తున్నాయన్నారు. యాప్స్‌ని ప్రమోట్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. యాప్స్ కారణంగా యువతలో ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు పెరిగాయని.. సమాజంలో జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వారి జీవించే హక్కును కోల్పోతున్నారని.. తాను ఇక్కడికి (కోర్టుకు) లక్షలాది మంది పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల తరఫున ఉన్నానన్నారు. పొగాకు ఉత్పత్తుల తరహాలోనే బెట్టింగ్ గురించి ఎలాంటి హెచ్చరికలు, అవగాహన లేదన్నారు. అయితే, సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేఏ పాల్ టీమిండియా దిగ్గజ క్రికెట్ సచిన్ టెండూల్కర్ పేరును ప్రస్తావించారు. ‘క్రికెట్ దేవుడు ఆమోదిస్తే.. ప్రజలు ఇది సరైందేనని అనుకుంటారు’ అని పేర్కొనగా.. జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. ‘ఐపీఎల్ చూడడం పేరుతో బెట్టింగ్ జరుగుతోందని ఆయనకు తెలుసు.. అయితే కేంద్రం ఏం చేస్తుందో తాము అడుగుతాం’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్రానికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. పిటిషన్ సాఫ్ట్‌కాపీని అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్‌కు ఇవ్వాలని సూచించింది. అవసరమైతే రాష్ట్రాలకు కూడా తరువాత నోటీసులు జారీ చేయవచ్చని ధర్మాసనం పేర్కొంది.