IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో పలు జట్లు అంచనాలను అందుకోలేకపోతున్నాయి. నిరుడు ఫైనల్లో తలపడిన కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) ఐదు విజయాలతో ఆరో స్థానంలో ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మాత్రం అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది. గత ఎడిషన్ మాదిరిగానే ఈసారి కూడా టాపార్డర్‌నే నమ్ముకున్న కమిన్స్ సేన ఒక విజయం.. వరుస ఓటములు అన్నచందంగా ఆడుతోంది. 10 మ్యాచుల్లో మూడంటే మూడే విజయాలతో ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్ ప్లే ఆఫ్స్ ఆవకాశాన్ని చేజార్చుకుంది.
ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ జట్టు చేయగలిగిందల్లా ఇతర జట్ల అవకాశాల్ని దెబ్బతీయడమే. సోమవారం ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను కమిన్స్ సేన ఢీ కొడుతోంది. పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన విధంగానే.. ఢిల్లీ బౌలర్లను ఉతికేయాలని యావత్ ఎస్ఆర్హెచ్ అభిమానులు కోరుకుంటున్నారు.
ధాటిగా ఆడితే నిలువరించడం కష్టం.. పేకమేడలా కూలిందంటే నిర్మించడం కష్టం. ఈ మాట 18వ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అతికినట్టు సరిపోతుంది. తొలి పోరులో రాజస్థాన్ రాయల్స్‌పై శతకంతో మెరిసిన ఇషాన్ కిషన్(Ishan Kishan) ఆ తర్వాత ఆడితే ఒట్టు. రాజస్థాన్‌పై విజయం తర్వాత టాపార్డర్ వైఫల్యంతో కమిన్స్ సేన వరుసగా లక్నో, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా చేతిలో ఓటమి చవిచూసింది. అయితే.. ఉప్పల్ మైదానంలో పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 245 పరుగుల లక్ష్యాన్ని మాత్రం ఉఫ్‌మని ఊదేసింది. అభిషేక్ శర్మ రికార్డు సెంచరీతో కదం తొక్కగా అద్భుత విజయంతో ప్లే ఆఫ్స్ పోటీలోకి వచ్చింది.
కానీ, ఆ తర్వాత మళ్లీ ఓటముల బాట పట్టింది. ఎట్టకేలకు చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయంతో ఆశలు రేపినా.. గుజరాత్ పంచ్‌కు కమిన్స్ బృందం చేతులెత్తేసింది. విధ్వంసక హిట్టర్లతో నిండిన హైదరాబాద్ తరఫున అత్యధిక రన్స్ చేసింది హెన్రిచ్ క్లాసెన్ మాత్రమే. ఈ చిచ్చరపిడుగు 228 రన్స్‌తో టాప్‌లో ఉండగా.. హెడ్ 261 పరుగులు, అభిషేక్ 240, అనికేత్ వర్మ.. 190 రన్స్ సాధించారు.
All the grind. All the prep. All for this. 💪#PlayWithFire | #SRHvDC | #TATAIPL2025 pic.twitter.com/Ab5UMpiNqZ
— SunRisers Hyderabad (@SunRisers) May 5, 2025
ఈసారి 10 మ్యాచుల్లో మూడే విక్టరీలతో ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన సన్‌రైజర్స్.. ఢిల్లీ చేతిలో ఓడితే గనుక ఇంటిదారి పట్టడం ఖాయం. ఇప్పటికే చెన్నై, రాజస్థాన్‌లు 8 ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించాయి. 7 మ్యాచుల్లో పరాజయం పాలైన హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌పై కన్నేసిన ఢిల్లీకి చెక్ పెడుతుందా.. లేదా? అనేది మరికాసేపట్లో తేలిపోనుంది. బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ కలిగిన ఢిల్లీని నిలువరించాలంటే ఆరెంజ్ ఆర్మీ సమిష్టిగా రాణించాల్సిందే.