బొంరాస్‌పేట్ : దుద్యాల్ మండలం లగచర్ల ( Lagacharla) , హకీంపేట్ ( Hakimpet lands) గ్రామాల పరిధిలోని పట్టాభూములను భారీ పోలీస్ బందోబస్తు ( Police security) మధ్య తహసీల్దార్ కిషన్ ఆధ్వర్యంలో సోమవారం సర్వే నిర్వహించారు.ఈ గ్రామాల పరిధిలోని సర్వే నంబర్ 9 లో 99 ఎకరాల 27గుంటల భూ సర్వే పూర్తిచేసినట్లు తహసీల్దార్ తెలిపారు.
సర్వే సమాచారం తెలియక రైతులు సర్వేకు ఆలస్యంగా రావడంతో సర్వే ఆలస్యం అయ్యింది. లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి, పులిచర్లకుంట తండా, రోటిబండ తండాల పరిధిలో ప్రభుత్వం పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం భూసేకరణకు గతంలో నోటిఫికేషన్ చేశారు. అందులో భాగంగా భూముల సర్వే నిర్వహించి రైతుల నుంచి వారి అంగీకారంతోనే భూములను సేకరించి నష్టపరిహరం ఇస్తామని తెలిపారు.
హకీంపేట్, పోలేపల్లిలో వివాదాలులేకున్నా లగచర్ల, రోటిబండ తండా,పులిచర్లకుంట తండాలలో గతంలో భూముల విషయంలో వివాదలు నెలకొన్నాయి. గతంలో అధికారులపై దాడులు వంటి సంఘటనలు చోటుచెసుకోవడంతో అధికారులు ముందస్తుగా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీధర్‌రెడ్డి, ఉపతహసీల్దార్ వీరేష్‌బాబు, ఆర్ఐ నవీన్‌కుమార్, వివిధ మండలాల ఎస్సైలు , సర్వేయర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.