Sourav Ganguly : ఐపీఎల్ పదిహేడో సీజన్ ముగియడంతో భారత జట్టు టీ20 వరల్డ్ కప్(T20 Wolrd Cup 2024) సన్నాహాకాల్లో బిజీగా ఉంది. ఈ సమయంలో రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) అనంతరం హెడ్‌కోచ్ పదవి చేపట్టేది? ఎవరు అనే చర్చ జోరుగా నడుస్తోంది. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)కు మూడో టైటిల్ కట్టబెట్టిన గౌతం గంభీర్(Gautam Gambhir) పేరు ఖరారైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Sourav Ganguly) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రధాన కోచ్‌ను తెలివిగా ఎంచుకోవాలని దాదా సూచించాడు.
తన ఎక్స్ ఖాతాలో గురువారం గంగూలీ ఓ పోస్ట్ పెట్టాడు. అందులో.. ‘ఒక వ్యక్తి జీవితంలో కోచ్ పాత్ర చాలా ముఖ్యమైనది. మైదానంలో, మైదానం బయటా నిరంతర శిక్షణ ఏ వ్యక్తి భవిష్యత్తునైనా తీర్చిదిద్దుతుంది. అందుకని కోచ్‌ను, ఏదైనా సంస్థను తెలివిగా ఎంపిక చేసుకోవాలి’ అని గంగూలీ రాసుకొచ్చాడు. క్షణాల్లోనే మాజీ సారథి పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్ట్ చూసిన కొందరు నువ్వు గౌతం గంభీర్‌కు వ్యతిరేకమా? అని ప్రశ్నిస్తున్నారు. మరొకొందరేమో గతంలో గ్రెగ్ చాపెల్ హయాంలో పడిన కష్టాలు గుర్తుకొచ్చాయా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Is this an indirect message from Sourav Ganguly to BCCI for the selection of next Indian head-coach? 🤔#SouravGanguly #BCCI #IndianCricketTeam #CricketTwitter pic.twitter.com/KdhuVUFm4d
— InsideSport (@InsideSportIND) May 30, 2024
టీ20 వరల్డ్ కప్ టోర్నీతో కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ గడువు ముగుస్తుంది. అందుకని బీసీసీఐ కొత్త కోచ్ ఎంపిక కోసం ప్రకటన విడుదల చేసింది. ఆశావహులు మే 27వ తేదీలోపు అప్లై చేసుకోవాలని కోరింది. అంతేకాదు కోచ్ పదవి చేపట్టాల్సిందిగా న్యూజిలాండ్ మాజీ సారథి స్టీఫెన్ ఫ్లెమింగ్(Stephen Fleming), భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్‌లను బీసీసీఐ పెద్దలు అభ్యర్థించారు.
చెన్నై సూపర్ కింగ్స్ హెడ్‌కోచ్‌గా ఉన్నన ఫ్లెమింగ్ అయిష్టంగా ఉండగా.. గౌతీ ఇంకా ఏమీ చెప్పలేదు. పదిహేడో సీజన్లో గంభీర్ మెంటార్‌గా ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ చాంపియన్‌గా నిలిచింది. దాంతో భారత జట్టు హెడ్‌కోచ్‌గా గంభీర్ నియామకం జరిగిపోయిందని, బీసీసీఐ ప్రకటనే తరువాయి అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ, ఈ వ్యవహారంపై అటు గౌతీగానీ, ఇటు బీసీసీఐగానీ నోరు మెదపలేదు.