Blast At Mosque | పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియా (Nigeria)లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ మసీదుపై దాడికి పాల్పడ్డారు (Blast At Mosque). ఈ దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. ఈశాన్య నైజీరియా నగరమైన మైదుగురి (Maiduguri)లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
నగరంలోని గాంబోరు మార్కెట్లోని రద్దీగా ఉండే మసీదులో బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రార్థన సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఆత్మాహుతి దాడిగా జిహాదిస్ట్ వ్యతిరేక మిలీషియా నాయకుడు బాబాకురా అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఈ దాడికి ఇప్పటి వరకూ ఏ సాయుధ గ్రూపులూ బాధ్యత వహించలేదు. పేలుడు ధాటికి మసీదు పూర్తిగా శిథిలమైంది.
మైదుగురి బోర్నో (Borno) రాష్ట్ర రాజధాని. ఈ ప్రాంతం జిహాదిస్టు గ్రూపులు, దాని అనుబంధ సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ ద్వారా జరుగుతన్ను తిరుగుబాటుకు నిలయంగా ఉంది. 2009 నుంచి నైజీరియాలో ఇస్లామిక్ రాజ్య స్థాపన లక్ష్యంగా సాగుతున్న ఈ ఉగ్రవాద పోరులో ఇప్పటివరకు సుమారు 40 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 20 లక్షల మందికి పైగా నిరాశ్రయులైనట్లు అక్కడి అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఇక్కడ ఎలాంటి దాడులూ జరగకపోవడంతో అక్కడి ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ఆ సమయంలో తాజా దాడి ప్రజలను మళ్లీ ఉలిక్కిపాటుకు గురి చేసింది.
Also Read..
కాలిఫోర్నియాలో 30 మంది భారతీయ డ్రైవర్ల అరెస్ట్
డేట్ కెళితే రూ.30 వేల ప్రోత్సాహకం
జైళ్లకు పరుగులు తీస్తున్న ఊబకాయులు!