బీజింగ్: జైలు సెల్లో కనిపిస్తున్న ఈ ఊబకాయ ఖైదీలంతా ఎలాంటి నేరం చేసి వచ్చిన వారు కాదు. వాస్తవానికి వీరంతా ఈ జైలులోకి స్వచ్ఛందంగా వచ్చిన వారే. అదేంటి.. జైలులోకి స్వచ్ఛందంగా వెళ్లడమేమిటని ఆశ్చర్యపోవద్దు. చైనాలో ఊబకాయంతో ఉన్న వారు తమ బరువు తగ్గించుకోవడానికి, స్లిమ్‌గా కావడానికి రూ.90 వేల ఫీజు కట్టి మరీ ఈ జైళ్లకు వెళ్తున్నారు. 28 రోజుల పాటు జైలులాంటి ప్రదేశంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ‘ఫ్యాట్ విజన్’ అని పేరు పెట్టారు. ఒకసారి ఫీజు కట్టి అందులోకి వెళితే వారు చెప్పింది వింటూ, వారు పెట్టింది తింటూ, వారు చేయమన్నది చేస్తూ ఖైదీల్లా అందులోనే 28 రోజులు గడపాలి. ఈ స్వచ్ఛంద ఖైదీలు బరువు తగ్గడానికి నిర్వాహకులు రోజుకు 4 గంటల పాటు వారితో వ్యాయామాలు చేయిస్తారు. బరువు తగ్గడానికి అవసరమైన నియమిత ఆహారాన్ని మాత్రమే ఇస్తారు. ఇలాంటి ప్రిజన్స్‌కు మంచి డిమాండ్ ఉంది.