Kerala | కేరళలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో క్రిస్మస్ వేడుకల నిర్వహణకు సంబంధించి ఆరెస్సెస్ (RSS) అనుబంధ సంస్థలు బెదిరింపులకు పాల్పడుతున్నాయన్న వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ వంటి లౌకిక రాష్ట్రంలో ఇలాంటి మతవిద్వేషపూరిత చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఆరెస్సెస్ శ్రేణుల ఒత్తిడికి తలొగ్గి క్రిస్మస్ వేడుకలను రద్దు చేశాయని, విద్యార్థుల నుంచి సేకరించిన చందాలను తిరిగి ఇచ్చేసినట్లు ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ఈ ఘటనలపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని కేరళ ప్రభుత్వాని ఆదేశిస్తున్నాను. మత వివక్షను ప్రోత్సహించే స్కూల్ మేనేజ్మెంట్లపై, వేడుకలను అడ్డుకొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాయడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వాన్ని, ప్రజల మధ్య ఉన్న సామరస్య పూర్వక సహజీవనాన్ని సంఘ్ పరివార్ వ్యతిరేకిస్తోంది అని ముఖ్యమంత్రి పినరయి ధ్వజమెత్తారు.
కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టి కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. పాఠశాలలను మతతత్వ ప్రయోగశాలలుగా మార్చనివ్వబోమని స్పష్టం చేశారు. కేరళలో ఓణం, క్రిస్మస్, ఈద్ వంటి పండుగలను అందరూ కలిసి జరుపుకొనే సంస్కృతి ఉందని, దానిని దెబ్బతీసే పనులు ఇక్కడ సాగనివ్వబోమని ఆయన హెచ్చరించారు. పాల్క్కాడ్లో ఇటీవల జరిగిన కరోల్ బృందాల మీద దాడులను కూడా ప్రస్తావిస్తూ మత సామరస్యాన్ని దెబ్బతీసే శక్తులపై రాజీలేని పోరాటం చేస్తామని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Thiruvananthapuram | Kerala CM Pinarayi Vijayan says, “There were also reports of pressure and threats from RSS-affiliated organisations against celebrating Christmas in some private schools. Some schools cancelled celebrations and refunded the money collected from students. The… pic.twitter.com/VEi03mEXSW
— ANI (@ANI) December 24, 2025