అబుదాబి : ఆసియాకప్‌లో శ్రీలంక, అఫ్గానిస్థాన్ మధ్య అభిమానులను ఆకట్టుకుంది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో అఫ్గన్ పోరాడినా..లంకదే పైచేయి అయ్యింది. గురువారం జరిగిన గ్రూపు-బీ పోరులో లంక 6 వికెట్ల తేడాతో ఆఫ్గన్‌పై ఘన విజయం సాధించింది. గెలిచి సూపర్-4 బెర్తు దక్కించుకుందామనుకున్న ఆఫ్గన్ ఆశలపై లంక నీళ్లు చల్లడంతో బంగ్లాదేశ్‌కు బెర్తు ఖాయమైంది.టాస్ గెలిచిన అఫ్గన్ టీమ్ తొలుత 20 ఓవర్లలో 169/8 స్కోరు చేసింది. అయితే నువాన్ తుషార(4/18) ధాటికి పవర్‌ప్లే ముగిసే లోపే అఫ్గానిస్థాన్ 40 పరుగులకు 3 కీలక వికెట్లు కోల్పోయింది. గుర్బాజ్(14), జనత్(1), సెదికుల్లా(18) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఇదే అదనుగా ఒత్తిడి పెంచుతూ పోయిన లంక సఫలమైంది. వరుస విరామాల్లో రసూలీ(9), అజ్మతుల్లా(6), ఇబ్రహీం జద్రాన్(24) వెంటవెంటనే పెవిలియన్ చేరారు.
దీంతో 79 పరుగులకు అఫ్గన్ సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కనీసం వంద పరుగులైనా చేరుకుంటుందా అన్న స్థితిలో మహమ్మద్ నబీ(22 బంతుల్లో 60, 3ఫోర్లు, 6సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. కెప్టెన్ రషీద్‌ఖాన్(24)తో కలిసి ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకొచ్చాడు. లంక బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ ఆఖరి రెండు ఓవర్లలో విధ్వంసమే సృష్టించాడు. 20 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ చేరుకున్న నబీ..వెల్లలగె వేసిన 20వ ఓవర్లో వరుసగా ఐదు బంతుల్లో ఐదు భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. ఒక దశలో యువరాజ్‌సింగ్ ఫీట్‌ను సమం చేస్తాడనుకున్న నబీ ఆఖరి బంతికి రనౌట్‌గా వెనుదిరిగాడు. నబీ ధాటికి చివరి రెండు ఓవర్లలో అఫ్గన్‌కు 49 పరుగులు వచ్చాయి. చమీర, వెల్లలగె, శనక ఒక్కో వికెట్ తీశారు.
మెరిసిన మెండిస్: అఫ్గన్ నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్ కుశాల్ మెండిస్(52 బంతుల్లో 74 నాటౌట్, 10ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో లంక 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి గెలిచింది. మిశార(4)నిరాశపరిచినా.. పెరెరా(28), కమిందు మెండిస్(26 నాటౌట్)తో కలిసి కుశాల్ మెండిస్ జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు.
అఫ్గానిస్థాన్: 20 ఓవర్లలో 169/8(నబీ 60, రషీద్ 24, తుషార 4/18, శనక 1/29),
శ్రీలంక: 18.4 ఓవర్లలో 171/4(మెండిస్ 74 నాటౌట్, పెరెరా 28, ఒమర్జాయ్ 1/10, నబీ 1/20)