IND vs ENG : లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ ఆలౌట్ అంచున నిలిచింది. లంచ్ తర్వాత రెండో ఓవర్లోనే సిరాజ్ ఆతిథ్య జట్టును గట్టి దెబ్బ కొట్టాడు. క్రీజులో కుదురుకున్న జేమీ స్మిత్(51)ను ఔట్ చేసి స్టోక్స్ సేనకు షాకిచ్చాడు. వికెట్ కీపర్ జురెల్ అద్భుతంగా అందుకున్నాడు. అంతే.. 8వ వికెట్‌కు 84 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. తొలి సెషన్లో సిరాజ్ ఓవర్లో 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేఎల్ రాహుల్ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన స్మిత్.. అర్ద శతకంతో ఆదుకున్నాడు. కానీ, ఈసారి మాత్రం సిరాజ్కే వికెట్ ఇచ్చేసి వెనుదిరిగాడీ యువకెరటం.
పొడిగా, నిర్జీవంగా మారిన లార్డ్స్ పిచ్ మీద భారత పేసర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. రెండో రోజు తొలి సెషన్లో జస్ప్రీత్ బుమ్రా ధాటికి ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్లు డగౌట్‌కు క్యూ కట్టారు. రెండో కొత్త బంతితో చెమటలు పట్టించిన బుమ్రా.. బెన్ స్టోక్స్(44)ను బౌల్డ్ చేసి ఐదో వికెట్ భాగస్వామ్యాన్ని విడదీశాడు.
Siraj removes Smith for 51 in the second over after lunch! ☝️https://t.co/dp3RtHo2QM | #ENGvIND pic.twitter.com/N5kwXGmpQw
— ESPNcricinfo (@ESPNcricinfo) July 11, 2025
ఆ కాసేపటికే సెంచరీ వీరుడు జో రూట్(104)ను సైతం క్లీన్‌బౌల్డ్ చేసి ఆతిథ్య జట్టును గట్టి దెబ్బకొట్టాడీ స్పీడ్‌స్టర్. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు పడిన షాక్ నుంచి తేరుకోకముందే క్రిస్ వోక్స్(0) వికెట్ సాధించి ఇంగ్లండ్‌ను ఆలౌట్ అంచున నిలిపాడు బుమ్రా. అయితే.. జేమీ స్మిత్ (51), బ్రాండన్ కార్సే(12 నాటౌట్)లు విలువైన భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. దాంతో, లంచ్ సమయానికి ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది.