దామరచర్ల, జులై 11 : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని 5వ యూనిట్ పనులను జనవరి, 2026 నాటికి పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అయన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో గల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను రాష్ట్ర జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్.హరీశ్‌తో కలిసి సందర్శించారు. విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌ను, పవర్ స్టేషన్‌కు బొగ్గు సరఫరా చేసే మార్షలింగ్ యార్డును, కూలింగ్ టవర్లు, స్విచ్ యార్డ్, తదితర యూనిట్లను ప్రిన్సిపల్ సెక్రెటరీ పరిశీలించారు. వైటీపీఎస్ సమావేశ కార్యాలయంలో ఇంజినీరింగ్, బీహెచ్ఈఎల్, జెన్కో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. జనవరి నుండి విద్యుత్‌కు ఏర్పడే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అనుకున్న సమయానికంటే ఒక నెల ముందుగానే 5వ యూనిట్ పనులు పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే టౌన్షిప్ పనులు నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్.హరీశ్ మాట్లాడుతూ.. వైటీపీఎస్‌కు వచ్చే రోడ్లు, అంతర్గత రహదారులను అభివృద్ధి చేయాలన్నారు. ప్రాజెక్ట్ ఆవరణలోని స్క్రాప్‌ను తొలగించాలని చెప్పారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రైల్వే పనులు చేపట్టాలని, 2047 విజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ బొగ్గు మెకానిజాన్ని రూపొందించాలని సూచించారు.
బీహెచ్ఈఎల్ పవర్ డైరెక్టర్ తీజేందర్ గుప్తా మాట్లాడుతూ.. బీహెచ్ఈఎల్ తరఫున ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా అధికారులు ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, వైటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ రమేశ్ బాబు, కోల్ డైరెక్టర్ నాగయ్య, సివిల్ డైరెక్టర్ అజయ్, థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, థర్మల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మయ్య, సివిల్ సీఈ శ్రీనివాసరావు, బీహెచ్ఈఎల్ సీఈ సురేశ్, ఈడీ వినోద్ జాకబ్ పాల్గొన్నారు.
Damaracharla : జనవరి 26 వరకు యాదాద్రి 5వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి : నవీన్ మిట్టల్