Child : ఓ 22 ఏళ్ల యువతి పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తల్లి అయ్యింది. విషయం నలుగురికి తెలిస్తే పరువు పోతుందని ఆసత్రిలోనే బిడ్డను అమ్మకానికి పెట్టింది. పిల్లలు లేని దంపతులకు రూ.50 వేలకు తన బిడ్డను అమ్మింది. అస్సాం (Assam) రాష్ట్రం చరాయ్డియో (Charaideo) జిల్లాలోని శివసాగర్ (Sivasagar) సివిల్ ఆస్పత్రి (Civil hospital) లో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకు చెందిన ఓ 22 ఏళ్ల యువత పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. పురిటి నొప్పులు రావడంతో డెలివరీ కోసం శివసాగర్ సివిల్ ఆస్పత్రిలో చేరింది. అక్కడ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను పిల్లలు దంపతులకు అమ్ముకుంది. చైల్డ్ వేల్ఫేర్ కమిటీ సభ్యులకు విషయం తెలిసి ఆస్పత్రికి వెళ్లి బాలింత యువతితో మాట్లాడారు. పసిబిడ్డను అమ్మవద్దని చెప్పి వెళ్లారు. అయినా ఆమె వినిపించుకోకుండా బిడ్డను అమ్మేసింది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఆశా వర్కర్ల పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.