Retirement Benefits | ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 16: ఉద్యోగ విరమణ చేసి రెండేండ్లయినా ఇప్పటికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్సారీ తీవ్ర అనారోగ్యంతో దవాఖానలో చేరారు. రిటైర్ అయినప్పటి నుంచి తనకు రావాల్సిన ప్రయోజనాల కోసం ఓయూ అధికారులతో ఆయన పోరాటం చేస్తున్నారు. తనకు పెన్షన్, ఇతర ప్రయోజనాలు అందించకపోవడంతో రాష్ట్ర మైనారిటీ కమిషన్ను ఆశ్రయించారు.
దీనిపై ఆయనకు తక్షణమే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం పెన్షన్ చెల్లించాలని ఆదేశించినా, వర్సిటీ అధికారులు జాప్యం చేయడంతో ఆయన పలుమార్లు ఆందోళన సైతం చేపట్టారు. తన సమస్యను చెప్పుకొనేందుకు పరిపాలనా భవనానికి వస్తుంటే.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రతాసిబ్బంది గేటు దగ్గరే ఆయనను అడ్డుకుంటున్నారు. దీంతో ఆయన ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిరసన వ్యక్తంచేశారు. ఇది వర్సిటీలో తీవ్ర చర్చనీయాంశమై అన్ని సంఘాలు ఆయనకు మద్దతు ప్రకటించాయి. సుదీర్ఘకాలం ప్రొఫెసర్గా పనిచేసి, ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తిని పరిపాలనా భవనంలోకి అనుమతించకపోవడంపై విద్యార్థి నాయకులు మండిపడ్డారు.
గత వీసీ, రిజిస్ట్రార్, ప్రస్తుత వీసీ, రిజిస్ట్రార్లు ఉద్దేశపూర్వకంగానే ఆయనకు అన్యాయం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తీవ్ర మానసిక ఒత్తడికి గురవడం వల్లనే ఆయన పలు అనారోగ్య సమస్యల బారిన పడ్డారని చెప్తున్నారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను మెహిదీపట్నంలోని మైత్రి దవాఖానలో చేర్పించారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని ఆయనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.