Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఆయన ఎడమ చేతికి షోల్డర్ బ్యాగ్ వేసుకుని పలు కార్యక్రమాల్లో కనిపించడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. తాజాగా ఈ విషయంపై స్వయంగా చిరంజీవి స్పందిస్తూ తనకు భుజానికి చిన్న సర్జరీ జరిగిందని వెల్లడించారు. దీంతో అభిమానులు ఊరట చెందుతున్నారు. ఇటీవల చిరంజీవి షోల్డర్ బ్యాగ్‌తో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో “ఏమైంది?”, “ఆరోగ్యం బాగుందా?” అంటూ అభిమానులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఒక ఫోటోను షేర్ చేస్తూ పూర్తి వివరాలు వెల్లడించారు. తనకు సర్జరీ చేసిన డాక్టర్‌తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ అభిమానులకు భరోసా ఇచ్చారు.
చిరంజీవి తన పోస్టులో ఇలా పేర్కొన్నారు .. నా చేయికి ఉన్న బ్యాగ్ గమనించిన తర్వాత చాలా మంది శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి అడిగారు. ఇది కేవలం చిన్న భుజం కీహోల్ సర్జరీ మాత్రమే. నేను బాగా కోలుకుంటున్నాను. ఇప్పటికే నా రెగ్యులర్ పనులు కూడా ప్రారంభించాను. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించిన అత్యుత్తమ ఆర్థ్రోస్కోపీ సర్జన్లలో ఒకరైన డాక్టర్ నితిన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ, ఆందోళన, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు” అని తెలిపారు. ఈ పోస్టుతో అభిమానుల్లో నెలకొన్న అనుమానాలకు తెరపడింది. చిన్న సర్జరీ మాత్రమే జరిగిందని, ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని తెలిసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో “జాగ్రత్త సర్”, “త్వరగా పూర్తిగా కోలుకోండి” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
సినీ కెరీర్లో ఎన్నో ఏళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న చిరంజీవి ఆరోగ్యం గురించి అభిమానులు ఎప్పటికప్పుడు ఆరా తీయడం ఆయనపై ఉన్న ప్రేమకు నిదర్శనమని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మెగాస్టార్ ఇచ్చిన క్లారిటీతో అభిమానుల ఆందోళనకు ఫుల్ స్టాప్ పడింది. కాగా, చిరంజీవి చివరిగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో ప్రేక్షకులని పలకరించి పెద్ద హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు బాబీ దర్శకత్వంలో చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.