Money Fraud : ఆమె ఒంటి నిండా నగలు (Ornaments)..! చేతి నిండా నోట్ల కట్టలు (Currency)..! తిరగడానికి ఖరీదైన కార్లు (Coslty cars)..! ఉండటానికి పెద్ద ఇల్లు..! ఆమె స్నేహ హస్తం అందిస్తే ఎవరైనా ఎగిరి గంతులేస్తూ స్వీకరించాల్సిందే..! ఆ తర్వాత ఆమె కొట్టే దెబ్బకు దిమ్మతిరిగి బొమ్మ కనబడాల్సిందే..! డాబు, దర్పం ప్రదర్శిస్తూ.. సంపన్న మహిళలతో స్నేహం చేస్తూ.. పెట్టుబడుల పేరుతో లక్షలు వసూలు చేస్తూ.. ఆమె 20 మందికి పైగా మహిళల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ఎప్పటికైనా పాపం పండక తప్పదన్నట్లు ఇన్నాళ్లకు ఆ మహిళా చీటర్ పాపం పండింది. ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఆ ఘరానా మోసగత్తె కటకటాల పాలైంది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన 49 ఏళ్ల మహిళ సవిత.. మోసాలు చేయడమే అలవాటుగా పెట్టుకుంది. పెట్టుబడుల పేరుతో నమ్మిన వాళ్ల నుంచి డబ్బులు గుంజి జల్సాగా బతకడానికి మరిగింది. ఇప్పటికే ఒకసారి అరెస్టై జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చినా ఆమె బుద్ధి మారలేదు. ఏరియా మార్చి మళ్లీ అవే మోసాలకు తెరలేపింది. సంపన్న మహిళలను కిట్టీ పార్టీలకు పిలిచి పరిచయాలు పెంచుకుంది. అధిక లాభాల ఆశచూపి వారితో లక్షల్లో పెట్టుబడులు పెట్టించుకుంది. ఇలా మొత్తం 20 మందికిపైగా మహిళల నుంచి కోట్ల రూపాయలు గుంజి చేతులెత్తేసింది. కుసుమ అనే ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఆ కిలాడీ లేడి బండారం బయటపడింది.
దుబాయ్‌లో తన భర్త పనిచేస్తున్నాడని, అక్కడ తక్కువ ధరకు బంగారం దొరుకుంతుందని, అక్కడ బంగారంపై పెట్టుబడి పెడితే రెండేళ్లలో ఆ పెట్టుబడి రెండింతలవుతుందని 2023లో బాధితురాలు కుసుమకు సవిత ఆశ చూపింది. ఇద్దరి మధ్య చాలాకాలంగా పరిచయం ఉండటంతో సవిత మాటలు నమ్మిన కుసుమ రూ.24 లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత తాను ఉదయ టీవీ ప్రాజెక్టులో పెట్టుబడులు పెడితే అందుకు రెండింతలు లాభం వచ్చిందంటూ సవిత 2024లో కుసుమకు మరో ఆఫర్ చేసింది.
దాంతో ఆశపడ్డ కుసుమ మరో రూ.10 లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత కూడా బిడ్డ పెళ్లికి, కారు లోన్ క్లియరెన్స్‌కు, పెట్టుబడులకు అంటూ ఇంకో 61 లక్షల రూపాయలు వసూలు చేసింది. గత నెలలో సవిత ఇంటికి వెళ్లిన కుసుమ తనకు డబ్బులు అవసరం ఉందని, తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగింది. దాంతో సవిత తన నిజ స్వరూపం బయటపెట్టింది. డబ్బులు లేవు, గిబ్బులు లేవు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో అంది. ఇంట్లోంచి బయటికి వెళ్లిపొమ్మని హూంకరించింది.
దాంతో మోసపోయానని గ్రహించిన కుసుమ ఈ నెల 8న బెంగళూరులోని బసవేశ్వరనగర్ పోలీస్‌స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. సవితతోపాటు ఈ మోసంలో ఆమెకు సహకరించిన మరో ఆరుగురి పేర్లను కూడా కుసుమ తన ఫిర్యాదులో చేర్చింది. కుసుమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సవితను, మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. గతంలో కూడా మోసాలకు పాల్పడి జైలుకు వెళ్లిన సవిత.. ఈ కేసుకు సంబంధించిన అప్పులపై స్టే తీసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కొత్త అప్పులపై కూడా ఆమె స్టే కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిందని పోలీసులు వెల్లడించారు.