వాషింగ్టన్: ప్రతీకార సుంకాలతో (Trump Tariffs) ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విరుచుకుపడుతున్నాడు. చక్రవర్తులు అవసరం లేదని బ్రెజిల్ లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా (Luiz Inacio Lula da Silva) అనడంతో.. నొచ్చుకున్న ట్రంప్ ఆ దేశంపై అప్పటివరకు ఉన్న సుంకాలను 10 శాతం నుంచి ఒకేసారి 50 శాతానికి పెంచేశాడు. తాజాగా తన పొరుగు దేశం కెనడాపై (Canada) అక్కసు వెళ్లగక్కాడు. ఆ దేశంపై 35 శాతం సుంకాలు విధిస్తున్నట్లు చెప్పాడు. ఇతర వాణిజ్య భాగస్వామ్య దేశాలపై 15 నుంచి 20 శాతం టారీఫ్‌ను వసూలు చేస్తామని వెల్లడించాడు. ఈ నిర్ణయం వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించేశాడు. ఈ మేరకు కెనడా ప్రధాని మార్క్ కార్నీకి (Mark Carney) లేఖ రాశారు. తమతో కలిసి పనిచేయడానికి బదులు కెనడా ప్రతీకార సుంకాలు విధిస్తున్నదని అందులో మండిపడ్డారు.
ఆయా దేశాలపై గత ఏప్రిల్‌లో విధించిన టారీఫ్‌లను సవరిస్తూ వస్తున్న ట్రంప్.. జపాన్, దక్షిణ కొరియాలపై కూడా ప్రతీకార సుంకాలను పెంచిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటివరకు 22 దేశాలకు ట్రంప్ లేఖలు రాశాడు.
ఇక బ్రిక్స్ కూటమిలో ఉండే దేశాలపై అదనంగా 10 శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. అదేవిధంగా రష్యాతో వ్యాపారం చేస్తే భారత్‌పై 500 శాతం విధించాలని యోచిస్తున్నారు. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైన మూడేళ్ల తర్వాత కూడా ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వకుండా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించాలని అమెరికా యోచిస్తున్నది. రష్యాతో వాణిజ్యం చేస్తున్న భారత్, చైనాతోపాటు ఇతర దేశాల నుంచి తమ దేశంలో దిగుమతి అయ్యే వస్తువులపై 500 శాతం సుంకాలు విధించాలన్న బిల్లును ట్రంప్ తీసుకువస్తున్నారు.