నకిరేకల్, జూలై 10: గెట్ల పంచాయితీలు చూసినం.. కుక్కల పంచాయితీలు చూసినం..కోళ్ల పంచాయితీ మాత్రం ఎప్పుడు చూడలే.. తన కోడి కాళ్లు విరగ్గొట్టిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఓ మహిళ భీష్మించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మా రింది. ఎస్సై లచ్చిరెడ్డి వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నకిరేకల్ మం డలం గొల్లగూడెంకు చెందిన గంగమ్మ ఓ కోడిని పెంచుకుంటున్నది.
బుధవారం ఆ కోడి గంగమ్మ ఇంటి పక్కనే ఉన్న చిర్రబోయిన రవికి చెందిన గడ్డివాము దగ్గరకు వెళ్లింది. రవి కొడుకు రాకేశ్ కర్రతో కొట్టడంతో కోడి కాళ్లకు తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో గంగమ్మ నకిరేకల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. కోడి కాళ్లు విరగ్గొట్టిన రాకేశ్‌పై కేసు నమో దు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు ఎందుకమ్మా.. కోడికి ఎంత అవుతుందో చెప్పు.. డబ్బులు ఇప్పిస్తామని సర్దిచెప్పగా తనకు డబ్బు వద్దు.. కోడి కాళ్లు విరగ్గొట్టిన రాకేశ్‌కు శిక్షపడ్సాలిందేనని వాగ్వాదానికి దిగింది. సమస్యను పరిష్కరిస్తామని సీఐ రాజశేఖర్ చెప్పడంతో వెళ్లిపోయింది. గురువా రం ఇద్దరు కానిస్టేబుళ్లు గంగమ్మ ఇంటికి వెళ్లి సర్దిచెప్పగా రవి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ విషయంపై గ్రామ పెద్దలు కలగచేసుకుని సర్దిచెప్పారు.