NATS : అమెరికా (USA) లోని ఫ్లోరిడా (Florida) రాష్ట్రంలోగల టాంపా (Tampa) సిటీలో 8వ నాట్స్ తెలుగు సంబురాలు విజయవంతంగా ముగిశాయి. మూడు రోజులపాటు జరిగిన ఈ సంబురాల్లో వేలమంది పాల్గొన్నారు. సంబురాలు జరిగిన వేదిక ప్రాంగణం తెలుగువాళ్ళతో కిక్కిరిసిపోయింది. మహాసభల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్ (Guttikonda Srinivas) ఈ నాట్స్ తెలుగు సంబురాల విజయానికి ఎంతో కృషి చేశారు.
నాట్స్ సంబురాల కమిటీ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, చైర్, కో చైర్, టీమ్ మెంబర్లు శ్రీనివాస్‌కు సహకరించారు. ఈ సంబురాల్లో నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, అల్లు అర్జున్, శ్రీలీలతోపాటు అలనాటి నటీమణులు జయసుధ, మీనా సందడి చేశారు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ తమ మ్యూజిక్‌తో సంబురాలకు వచ్చిన వారిని ఉర్రూతలూగించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా సంబురాలు జరిగాయి.
ఈ నాట్స్ తెలుగు సంబురాల కోసం సైనికుల్లా పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ కమిటీ కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకలకు వచ్చిన అతిథులకు, కళాకారులకు, సహకరించిన వాలంటీర్లకు అందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ‘ఇది మన తెలుగు సంబురం.. జరుపుకుందాం కలిసి అందరం’ అనే నినాదంతో ప్రారంభమైన ఈ సంబురాలకు 20 వేల మందికిపైగా హాజరయ్యారు. గుత్తికొండ శ్రీనివాస్, బోర్డు చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, సెక్రెటరీ మల్లాది శ్రీనివాస్ చక్కని ప్రణాళిక, సమన్వయంతో పనిచేశారు.
ఈ సంబురాల్లో సామాజిక బాధ్యతగా హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి నాట్స్ రూ.85 లక్షల విరాళం అందజేసింది. ఈ విరాళాన్ని ఆస్పత్రి చైర్మన్, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు నాట్స్ బృందం అందజేసింది. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ-వసుంధర దంపతులను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ సంబురాల్లో భాగంగా అనేక సాంస్కృతిక, సామాజిక సేవ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.