Sikinder Raza : పొట్టి క్రికెట్లో జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా(Sikinder Raza) ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఈ మధ్యే సారథిగా పగ్గాలు చేపట్టిన రజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూనే.. వ్యక్తిగతంగా అనేక రికార్డులు నెలకొల్పుతున్నాడు. ఈమధ్యే ముగిసిన ఆఫ్రికా క్వాలిఫయర్(Africa Qualifier)లో రువాండాపై హ్యాట్రిక్ (Hat-trick) తీసిన రజా.. పొట్టి క్రికెట్లో హ్యాట్రిక్(Hat-trick) తీసిన తొలి జింబాబ్వే బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. తాజాగా స్వదేశంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'(Player Of The Match)గా ఎంపికైన రజా టీ20ల్లో మరో రికార్డుకి చేరువయ్యాడు.
పొట్టి క్రికెట్లో అతడికి ఇది 14వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. ఇంకొకసారి రజా ఈ అవార్డు గెలిస్తే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆల్‌టైమ్ రికార్డు బద్ధలు కొడతాడు. అవును.. కోహ్లీ టీ20ల్లో 15సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. అయితే.. రజా మాత్రం గత 18 నెలల కాలంలోనే కోహ్లీ రికార్డుకు చేరువకావడం విశేషం.
సికిందర్ రజా
ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రజా మొదట బంతితో చెలరేగాడు. 4 ఓవర్లలో 28 రన్స్ ఇచ్చ మూడు వికెట్లు పడగొట్టాడు. ఐర్లాండ్ నిర్దేశించిన 148 పరుగుల ఛేదనలో తర్వాత హాఫ్ సెంచరీతో రాణించి జట్టును గెలుపు వాకిట నిలిపాడు. మిడిలార్డర్లో వచ్చిన రజా ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. దాంతో, జింబాబ్వే ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది.
ఐపీఎల్ 16వ సీజన్ – పంజాబ్ కింగ్స్ తరఫున దుమ్మురేపిన రజా
నిరుడు టీ20 వరల్డ్ కప్‌లో బ్యాటుతో, బంతితో రాణించిన రజా.. ఆ తర్వాత ఐపీఎల్ 16వ సీజన్లోనూ దుమ్మురేపాడు. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన ఏడు మ్యాచుల్లో 139 పరుగులు చేశాడు. బంతితో 3 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. దాంతో, 17వ సీజన్ కోసం పంజాబ్ అతడిని అట్టిపెట్టుకుంది.
ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న రజా టీ20 వరల్డ్ కప్ 2024 క్వాలిఫై కోసం నిర్వహించిన ఆఫ్రికా క్వాలిఫయర్(Africa Qualifier)లో రెచ్చిపోయాడు. రువాండాపై హ్యాట్రిక్ (Hat-trick) తీసి.. పొట్టి క్రికెట్లో హ్యాట్రిక్(Hat-trick) తీసిన తొలి జింబాబ్వే బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.