Pro Tennis League : ప్రో టెన్సిస్ లీగ్ ఐదో సీజన్ గురువారం మొదలైంది. ఢిల్లీలోని ఆర్కే ఖన్నా స్టేడియం(RK Khanna Stadium)లో జరుగనున్న పోటీలు అభిమానులను అలరిస్తున్నాయి. ఆరంభం రోజున డిఫెండింగ్ చాంపియన్ గుర్గామ్ సఫైర్స్(Gurgaon Supphires)కు చుక్కెదురవ్వగా.. లక్నో ఏవియేటర్స్, పారామౌంట్ ప్రొఎక్ టైగర్స్, ఇంచిబన్ సమురాయ్, ఇంద్రప్రస్థ వారియర్స్ విజయం సాధించాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ టోర్నీ డిసెంబర్ 10 ఆదివారం ముగియనుంది. ఆదివారం సాయంత్ర ఆరు గంటలకు ఫైనల్ పోరు నిర్వహించనున్నారు.
దాంతో, గ్రూప్ ఏలో ఇంద్రప్రస్థ వారియర్స్, ఇంచిబన్ సమురాయ్ జట్లు టాప్ 2 లో నిలవగా.. గ్రూప్ బిలో లక్నో ఏవియేటర్స్, పారామౌంట్ ప్రొఎక్ టైగర్స్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. గత సీజన్ రన్నరప్ పారామౌంట్ ప్రొఎక్ టైగర్స్ అదిరే బోణీ కొట్టింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో శంకర స్టాగ్ బబోలత్ యోధాస్‌పై 83-77 తో గెలుపొందింది.
ఇక లక్నో జట్టు 88-72 తేడాతో డీఎంజీ ఢిల్లీ క్రూసేడర్స్ను ఓడించింది. గురువారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో ఇంద్రప్రస్థ వారియర్స్ 88-72తో ముంబై ఏసర్స్‌ను మట్టికరిపించగా.. ఇంచిబన్ సమురాయ్ 83-77తో డిఫెండింగ్ చాంపియన్ గుర్గామ్ సఫైర్స్పై విజయం సాధించింది. ఇక డబుల్స్‌లో శ్రావ్య శివాని, దివ్య ఉంగ్రిష్ ద్వయం 13-7తో సౌజన్య బవిశెట్టి, సహిరా సింగ్‌ను చిత్తు చేసింది.
రెండోరోజైన శుక్రవారం నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు సెంటర్ కోర్టులో డీఎంజీ ఢిల్లీ క్రూసేడర్స్తో లక్నో ఏవియేటర్స్ తలపడనుండగా.. కోర్ట్ 1లో శంకర స్టాగ్ బబోలత్ యోధాస్ జట్టు పారామౌంట్ ప్రొఎక్ టైగర్స్‌ను ఢీకొట్టనుంది. సాయంత్రం 6 గంటలకు ముంబై ఏసర్స్, ఇంద్రప్రస్థ వారియర్స్.. గూర్గామ్ సఫైర్స్, ఇంచిబన్ సమురాయ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.