Shoaib Malik : పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) పునరాగమనంపై క్లారిటీ ఇచ్చాడు. మూడేండ్లుగా పాక్ జెర్సీ వేసుకోని మాలిక్ మళ్లీ దేశం తరఫున ఆడే ఉద్దేశమే తనకు లేదని కుండబద్దలు కొట్టేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ఆల్‌రౌండర్ పలు విషయాలు వెల్లడించాడు. తమ దేశానికి చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ సలీమ్ ఖలిక్తో మాలిక్ ఫోన్ ఇన్‌లో మాట్లాట్లాడాడు.
‘చాలా ఏండ్లు దేశానికి ప్రాతినిధ్యవం వహించినందుకు సంతృప్తిగా ఉన్నా. నాకు మళ్లీ పాకిస్థాన్‌కు ఆడాలనే ఆలోచన లేదు. టీ20 లీగ్స్‌లో మాత్రమే ఆడుతున్నా. ఒకవేళ టీ20 జట్టులో చాన్స్ ఇస్తే పునరాగమనంపై నిర్ణయం తీసుకుంటా. అయినా నాకు మళ్లీ దేశానికి ఆడాలని లేదు అని మాలిక్ తెలిపాడు.
I have no interest in playing for Pakistan again. Shoaib Malik
Watch full interview on Cricket Pakistan website pic.twitter.com/mtmdOLhnVH
— Saleem Khaliq (@saleemkhaliq) July 25, 2024
వచ్చే ఏడాది సొంతగడ్డపై జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీపై కూడా మాలిక్ స్పందించాడు. పాకిస్థానీలు ప్రేమగల మనుషులని, భారత జట్టును అపూర్వంగా స్వాగతిస్తారని అన్నాడు. ‘దేశాల మధ్య వివాదాలు ఉంటే ప్రత్యేకంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. అంతేతప్ప ఆటల్లోకి రాజకీయాలను తేవొద్దు. నిరుడు పాక్ జట్టు భారత్‌కు వెళ్లింది. ఇప్పుడు టీమిండియాకు పాక్‌కు వచ్చే అవకాశం వచ్చింది.

నా దృష్టిలో ఇప్పుడు భారత జట్టులోని చాలామందికి పాక్‌లో ఆడిన అనుభవం లేదు. కచ్చితంగా టీమిండియా మా దేశం వస్తుందని ఆశిస్తున్నా’ అని మాలిక్ వెల్లడించాడు. ఈ వెటరన్ ఆల్‌రౌండర్ పాక్ తరఫున 2021 నవంబర్‌లో చివరి మ్యాచ్ ఆడేశాడు.

తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో మాలిక్ 35 టెస్టులు, 287 వన్డేలు, 124 టీ20లు ఆడాడు. జట్టులో చోటు కోల్పోయిన మాలిక్ పాకిస్థాన్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, ఇతర ఇంటర్నేషనల్ లీగ్స్‌లో ఆడుతున్నాడు. ఈ మధ్య మాలిక్ మూడో పెండ్లితో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా నుంచి విడాకులు తీసుకున్న మాలిక్.. సనా జావేద్ అనే టీవీ నటిని పెండ్లాడాడు.