Paris Olympics : పారిస్ వేదికగా ఒలింపిక్స్ పోటీలు సందడిగా సాగుతున్నాయి. ఫుట్‌బాల్, రగ్బీ మ్యాచ్‌లతో ఆరంభమైన విశ్వ క్రీడలు అభిమానులను అలరిస్తున్నాయి. ఆర్చరీ కూడా షూరూ కావడంతో టెన్నిస్ (Tennis) సమరం ఎప్పుడెప్పుడా? అని ఫ్యాన్స్‌లో ఆసక్తి మొదలైది. ఈ నేపథ్యంలో గురువారం ఒలింపిక్స్ నిర్వాహకులు టెన్నిస్ డ్రా విడుదల చేశారు. టాప్ సీడ్స్, టెన్నిస్ దిగ్గజాలకు సులువైన డ్రా లభించింది.
భారత టెన్నిస్ ఆశాకిరణం సుమిత్ నాగల్(Sumit Nagal) తొలి మ్యాచ్‌లో కొరెంటిన్ మౌటెట్(ఫ్రాన్స్)తో తలపడనున్నాడు. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీలు పారిస్ జంట రెబౌల్ రోజర్ వస్సెలిన్లతో తాడోపేడో తేల్చుకోనున్నారు.
పురుషుల సింగిల్స్‌లో వింబుల్డన్ విజేత కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz)కు తేలికైన డ్రా లభించింది. దాంతో, ఈ స్పెయిన్ కెరటం నాకౌట్ దశకు చేరడం నల్లేరు మీద నడకే. 16వ రౌండ్లో అల్కరాజ్. డానిల్ మెద్వెదేవ్, రూడ్లతో తలపడే చాన్స్ ఉంది. ఇక మాజీ నంబర్ 1 నొవాక్ జకోవిచ్(Novak Djokovic), రఫెల్ నాదల్(Rafael Nadal)లు రెండో రౌండ్లో ఎదరుపడే అవకాశముంది.
తొలి రౌండ్లో హంగేరికి చెందిన మార్టన్ ఫక్సోవిక్తో నాదల్ తలపడనున్నాడు. మాథ్యూ ఎబ్డెన్‌ను ఢీ కొట్టనున్న జకో తర్వాతి పోరులో స్పెయిన్ బుల్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. మహిళల విభాగంలో ఇగా స్వియాటెక్, ఎలెనా రిబాకినాలకు సులువైన డ్రా లభించగా.. అమెరికా సంచలనం కొకొ గాఫ్(Coco Gauff) మాత్రం కఠిన ప్రత్యర్థుల గ్రూప్‌లో ఉంది. ఇరినా కామెలియా(ఇరాన్)తో స్వియాటెక్ తొలి మ్యాచ్ ఆడనుంది. వరల్డ్ నంబర్ 2 గాఫ్ తొలి రౌండ్లో అజ్లా తొమ్లజనోవిక్(ఆస్ట్రేలియా)ను ఢీ కొట్టనుంది.