Deshapati Srinivas | సంక్రాంతి పండుగకు ఏపీకి వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టోల్ గేట్ల వద్ద ఫీజు మినహాయించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ స్పందించారు. దసరా, బతుకమ్మ పండుగ సమయంలో ట్రాఫిక్ కష్టాలు మీకు కనిపించ లేదా అని ఆయన్ను ప్రవ్నించారు. దసరా, బతుకమ్మ పండుగలకు కూడా టోల్ మినహాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని అన్ని టోల్ గేట్ల దగ్గర కూడా మినహాయింపు ఇవ్వాలని అన్నారు.
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని దేశపతి శ్రీనివాస్ తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి, వివక్షతో వ్యవహరిస్తుందని ఆరోపించారు. సంక్రాంతి పండుగకు ఏపీకి వెళ్లే ప్రయాణికులకు టోల్ మినహాయింపు ఇవ్వాలని రాసినట్లుగానే.. తెలంగాణలో కూడా టోల్ మినహాయింపుపై కేంద్రానికి లేఖ రాయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సూచించారు. సంక్రాంతి పండుగకు ఆంధ్రాకు వెళ్లే ప్రయాణికులకు పంతంగి, కొర్లపహాడ్ దగ్గర టోల్ మినహాయింపు ఇస్తున్నారని తెలిపారు. ఏపీలోని చిల్లకల్లు టోల్‌ప్లాజా దగ్గర కూడా వసూళ్లు ఆపాలని దేశపతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. చిల్లకల్లు టోల్ డబ్బులను కూడా తెలంగాణ ఖజానా నుంచే చెల్లిస్తారా.. అనే విషయాన్ని స్పష్టంచేయాలన్నారు.
ఆంధ్రాకు వెళ్లే రూట్లో టోల్ మినహాయింపు ఇచ్చినట్లే రాయలసీమకు వెళ్లే రూట్లలో ఎందుకు టోల్ మినహాయించలేదని దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. తెలంగాణ పండుగలకు కూడా టోల్ మినహాయించాలని డిమాండ్ చేశారు. దసరా, బతుకమ్మ పండుగల సమయంలో మీకు ట్రాఫిక్ కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం కాకుండా, అందర్నీ సమానంగా చూడాలని సూచించారు.