Hasin Jahan : భారత పేసర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసిన్ జహన్ (Hasin Jahan) మరో వివాదంలో చిక్కుకుంది. షమీ నుంచి విడాకులు, భరణం కోరుతూ కోర్టును ఆశ్రయించిన ఆమె పొరుగుంటిలో ఉండే మహిళపై దాడి చేసింది. దాంతో సదరు మహిళ జహన్పై డలియా ఖాటూన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై దాడి చేయడమే కాకుండా కుట్ర పన్నడం, హత్యా ప్రయత్నం చేసిందని ఆమె తన కంప్లైంట్లో వెల్లడించింది. ప్రస్తుతం జహన్ ఆ మహిళపై చేయి చేసుకుంటున్న వీడియో నెట్టింట వైరలవుతోంది.
జహన్కు, పొరుగుంటి మహిళకు మధ్య భూ వివాదమే తాజా గొడవలకు కారణమని తెలుస్తోంది. బెంగాల్లోని సురీ (Suri) పట్టణంలో ఉన్న ఒక స్థలం విషయంలో ఇరువురి మధ్య వివాదం నడుస్తోంది. దాంతో, తనకు చెందిన భూమిని లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని సదరు మహిళపై జహన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అనంతరం ఆ భూమిని తన కూతురు పేరుతో రిజిస్టర్ చేసి ఇంటి నిర్మాణం చేపట్టింది. అయితే.. స్థలం వివాదం కొలిక్కి రానందున అక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్టవద్దని ఆమెను వారించింది ఆ మహిళ. ఆమె తీరుతో చిర్రెత్తిపోయిన జహన్ చేయి చేసుకుంది.
Md. Shami ex-wife, Hasin Jahan, was caught on camera raising her hands on a neighbour in a Kalesh
pic.twitter.com/UILH6t7JIx— Ghar Ke Kalesh (@gharkekalesh) July 16, 2025
మోడల్ అయిన హసిన్ జహన్ను షమీ 2014లో పెండ్లి చేసుకున్నాడు. మరుసటి ఏడాది ఈ జంటకు అమైరా జన్మించింది. అయితే.. 2018లో షమీపై గృహ హింస కేసు (Domestic Violence) పెట్టిన జహన్.. ఆ తర్వాత విడాకులకు దరఖాస్తు చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ విడిగా ఉంటున్నారు. ఆరేళ్లకు పైగా సాగుతున్న కేసులో స్పీడ్స్టర్ను భరణం చెల్లించాల్సిందిగా హైకోర్టు ఈమధ్యే ఆదేశించింది. జహన్, కూతురు ఐరా ఖర్చుల కోసం ప్రతి నెల రూ.4 లక్షలు ఇవ్వాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. ఇరువురి వాదనలు విన్న జస్టిస్ అజయ్ కుమార్ ముఖర్జీ భరణం కింద భార్యకు రూ.1.5లక్షలు, కూతురుకు రూ.2.5 లక్షలు ఇవ్వాల్సిందేనని షమీకి స్పష్టం చేశారు.