Resolve consumer problems | సిరిసిల్ల టౌన్, జూలై 18: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్)-2 నిజామాబాద్ జిల్లా చైర్మన్ ఈ నారాయణ అన్నారు. ఈ మేరకు సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్, సిరిసిల్ల) ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీజీఆర్ఎఫ్ నిజామాబాద్ జిల్లా చైర్మన్ ఈ నారాయణ వినియోదారుల నుండి విద్యుత్ లూజ్ లైన్, అధిక బిల్లులు, తదితర సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో లూజ్ లైన్లతో ప్రమాదం పొంచి ఉంటుందని, ఎక్కడైతే సదరు సమస్యలు ఉన్నాయో అధికారులు గుర్తించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిలో బాగంగా గత నవంబర్ నుండే యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకుని ముందుకు వెళ్తున్నామని అన్నారు.
లూజ్ లైన్ లో ఓల్టేజీపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని వీటి పరిష్కారం కోసం అధికారులు, పాలకవర్గానికి సూచనలు చేస్తున్నామని అన్నారు. సెస్ కార్యాలయంలో సిటిజన్ చార్టర్ ను ప్రతీ సెక్షన్లో ఏర్పాటు చేయాలని సూచించారు. దీని ద్వారా వినియోగదారులకు అవగాహన కలుగుతుందని, అధిక బిల్లులపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి అసవరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్థంభాలను తొలిగించి వాటి స్థానంలో సిమెంట్ స్థంభాల స్థానoలో కొత్తవి ఏర్పాటు చేయాలని తెలిపారు. 30 రోజులకు ఒకసారి విద్యుత్ బిల్లులు చేస్తున్నారని, వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించాలని సూచించారు. ఈ సమావేశంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, ఎండీ రామసుబ్బారెడ్డి, సెస్ డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది, వినియోగదారులు, తదితరులు పాల్గొన్నారు.