గాయం, ఫామ్ లేమితో జట్టుకు దూరమైనా ఇటీవలే రీఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్న టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు అతడు ఊహించని ప్రమోషన్ దక్కనుందా..? టీ20లలో రోహిత్ శర్మకు డిప్యూటీగా హార్దిక్‌ను నియమించనున్నారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. కీలక టోర్నీలు ముందున్న నేపథ్యంలో సెలక్టర్లు టీమిండియా టీ20 వైస్ కెప్టెన్సీ బాధ్యతలను కెఎల్ రాహుల్ నుంచి హార్దిక్‌కు బదిలీ చేయనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం కెఎల్ రాహుల్ టీ20, వన్డేలలో వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ అతడు తరుచూ గాయాల బారిన పడుతుండటంతో పలు సిరీస్‌లకు అందుబాటులో ఉండటంలేదు. భావి సారథిగా భావిస్తున్న రాహుల్ వరుసగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటుండంతో సెలక్టర్లు కూడా ఈ విషయంలో పునరాలోచనలో పడ్డారు. దీంతో టీమ్ మేనేజ్మెంట్ టీ20 ప్రపంచకప్‌లో రాహుల్‌కు బదులు పాండ్యాకు ఉపసారథి పగ్గాలు అప్పజెప్పాలని చూస్తున్నారని బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది.
రీఎంట్రీలో హార్దిక్ ఇటీవలే ముగిసిన ఐపీఎల్-15లో గుజరాత్ టైటాన్స్‌ను అద్భుతంగా నడిపించాడు. అతడి కెప్టెన్సీ స్కిల్స్‌పై అందరూ ప్రశంసలు కురిపించారు. దీంతో రోహిత్ శర్మకు డిప్యూటీగా అతడిని నియమిస్తే అతడు లేని సమయాల్లో సారథ్య బాధ్యతలు కూడా అప్పగించొచ్చనే భావనలో సెలక్టర్లు ఉన్నారు. కెఎల్ రాహుల్‌తో పోలిస్తే సారథిగా పాండ్యాకే మంచి మార్కులు పడటం కూడా దీనికి ఒక కారణం.
ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న పొట్టి ప్రపంచకప్ కోసం ఎంపిక చేసే జట్టులో హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌గా నియమించడం లాంఛనమే అని సెలక్షన్ కమిటీ సభ్యులు కూడా చెబుతున్నారు.
ఇదే విషయమై ఓ సెలక్టర్ మాట్లాడుతూ.. ‘హార్దిక్ ప్రపంచ స్థాయి ఆటగాడు. రీఎంట్రీలో అతడు అదరగొడుతున్నాడు. అతడిని సెలక్టర్లు వైస్ కెప్టెన్‌గా చేస్తారా..? లేదా..? అనేది త్వరలో తేలుతుంది. కానీ అతడిప్పటికే జట్టులో నాయకుడు. ఒక ఆల్‌రౌండర్‌గా జట్టుకు ఏం కావాలి..? ఏ పరిస్థితుల్లో ఎలా ఆడాలి..? అనేదానిపై అతడికి అవగాహన ఉంది. అదీగాక అతడిలో లీడర్షిప్ స్కిల్స్ అందరూ ఐపీఎల్లో చూశారు. వైస్ కెప్టెన్‌గా అతడు రాణిస్తాడన్న నమ్మకముంది..’ అని తెలిపాడు.
హార్దిక్ ఇదివరకే స్వదేశంలో సౌతాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్‌లో వైస్ కెస్టెన్గా వ్యవహరించగా.. ఇటీవలే ఐర్లాండ్ టూర్లో సారథిగా ఉన్న విషయం తెలిసిందే.