పారిస్: ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత పోరాటం ముగిసింది. ఈ టోర్నీ బరిలో ఉన్న ఏకైక భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీస్‌లో ఓటమి పాలయ్యారు. శనివారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్లో సాత్విక్ జోడీ.. 19-21, 21-18, 12-21తో 11వ సీడ్ చైనా ద్వయం చెన్ బొయాంగ్-లి యి చేతిలో పరాభవం పాలైంది. క్వార్టర్స్‌లో సాధికారక ఆటతీరుతో మలేషియా స్టార్ షట్లర్లకు షాకిచ్చిన భారత ఆటగాళ్లు.. సెమీస్‌లో మాత్రం ఆ జోరును చూపించడంలో విఫలమయ్యారు. తొలి గేమ్‌ను భారత జోడీ 9-3 ఆధిక్యంతో దూకుడుగానే ఆరంభించింది. కానీ ఆ తర్వాత చేసిన స్వయంకృతాపరాధాలకు తోడు చైనా షట్లర్లు ఒక్కో పాయింట్ దక్కించుకుంటూ వెళ్లి గేమ్‌ను సొంతం చేసుకున్నారు.
రెండో గేమ్‌లో విరామ సమయానికి భారత జోడీ 11-9తో ఆధిక్యంలో నిలిచినా ఆ తర్వాత మళ్లీ తడబాటుకు గురైంది. అయితే సాత్విక్ వరుస స్మాష్‌లతో గేమ్‌ను భారత్ వైపునకు తిప్పడంతో ఆట మూడో గేమ్‌కు వెళ్లింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో చైనా జోడీ దూకుడు పెంచింది. భారత షట్లర్లపై ఎదురుదాడికి దిగిన చైనా జంట.. ఒక దశలో 9-0తో ఆధిక్యం సాధించింది. సాత్విక్ కొద్దిగా పోరాడినా చివరికి చైనా ద్వయం 21-12తో గేమ్‌ను ముగించి ఫైనల్ చేరింది. కాగా వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో సాత్విక్, చిరాగ్‌కు ఇది రెండో పతకం. 2022 (జపాన్)లోనూ వీళ్లిద్దరూ కాంస్యం నెగ్గారు.