టోక్యో: భారత బ్యాడ్మింటన్ స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్‌శెట్టి టైటిల్ వేటకు సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి మొదలుకానున్న జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15వ ర్యాంక్‌లో కొనసాగుతున్న సాత్విక్,చిరాగ్ జోడీ ఈ సీజన్లో మూడు టోర్నీల్లో సెమీస్‌కు చేరుకుంది. గత నెలలో జరిగిన ఇండోనేషియా ఓపెన్ క్వార్టర్స్‌లో తమ పోరాటాన్ని ముగించింది. అయితే గాయం నుంచి తేరుకుని పూర్తి ఫిట్నెస్తో ఉన్న ఈ జోడీ తమ తొలి పోరులో కొరియా ద్వయం కాంగ్ మిన్ హుక్, కి డాంగ్ జుతో తలపడుతుంది. మరోవైపు పేలవ ప్రదర్శనతో విఫలమవుతూ వస్తున్న యువ షట్లర్ లక్ష్యసేన్ ఈసారైనా సత్తాచాటాలని చూస్తున్నాడు. ఆల్‌ఇంగ్లండ్ టోర్నీలో క్వార్టర్స్ ప్రదర్శన తర్వాత తేలిపోయిన లక్ష్యసేన్ జపాన్ ఓపెన్‌లో రాణించాలన్న పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు ఇటీవలే 30వ పడిలోకి ప్రవేశించిన పీవీ సింధు పేలవ ప్రస్థానం కొనసాగుతూనే ఉన్నది. వీరికి తోడు ఉన్నతి హుడా, అనుపమ ఉపాధ్యాయ, హరిహరణ్, రుబాన్కుమార్ బరిలో దిగనున్నారు.