Satwiksairaj – Chirag Shetty : భారత స్టార్ బ్యాడ్మింటన్ డబుల్స్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్ రింకిరెడ్డి – చిరాగ్ శెట్టీ కెరీర్ బెస్టు ర్యాంక్ సాధించారు. రెండు రోజుల క్రితం తొలి సూపర్ 1000 పురుషుల టైటిల్(Super 1000 men’s doubles title) నెగ్గిన వీళ్లు 3వ ర్యాంకుకు ఎగబాకారు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ మంగళవారం డబుల్స్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న చిరాగ్ – సాత్విక్ మూడో ర్యాంకులో నిలిచారు.
ఇండోనేషియాకు చెందిన ఆర్డియాంటో(M. R. Ardianto), అల్ఫియాన్(F. Alfian) ద్వయం అగ్రస్థానం దక్కించుకున్నారు. చైనా డబుల్స్ ప్లేయర్లు లియాంగ్, వాంగ్ రెండో రెండో ర్యాంక్ సాధించారు. పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) మూడు ర్యాంకులు మెరుగుపరచుకొని టాప్ 20లోకి వచ్చాడు. మలేషియా మాస్టర్స్‌లో సత్తా చాటిన శ్రీకాంతో ఈ టోర్నీలో మాత్రం తేలిపోయాడు. క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగి నిరాశపరిచాడు.
స్విస్ ఓపెన్ నెగ్గిన సాత్విక్ – చిరాగ్
చిరాగ్ – సాత్విక్ డబుల్స్‌లో గత ఏడాది నుంచి అత్యుత్తమంగా ఆడుతున్నారు. 2023లో సాత్విక్ – చిరాగ్ జోడీ టైటిళ్ల వేట కొనసాగిస్తున్నారు. జూన్ 18న (ఆదివారం) జరిగిన ఇండోనేషియా ఓపెన్ డబుల్స్ ఫైనల్లో ఈ జోడీ వరల్డ్ చాంపియన్స్ ఆరోన్ చియా, సోహ్ వూహి ఇకీపై సంచలన విజయం సాధించారు. వరుస సెట్లలో 21-17, 21-18 తేడాతో చిత్తు చేశారు. దాంతో, తొలిసారి సూపర్ 1000 టైటిల్ చాంపియన్లుగా నిలిచిన భారత షట్లర్లుగా రికార్డు సృష్టించారు. అంతకుముందు వీళ్లిద్దరూ స్విస్ ఓపెన్ టైటిల్ నిలబెట్టుకున్నారు. అంతేకాదు కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే.