Ashes Series : యాషెస్ సిరీస్ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఆఖరి రోజు గెలుపు అవకాశాలు ఇంగ్లండ్(England), ఆస్ట్రేలియా(Australia) జట్లకు సమానంగా కనిపిస్తున్నాయి. ఐదు టెస్టుల సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లేందుకు ఆస్ట్రేలియాకు 174 పరుగులు కావాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. దాంతో, ఆసీస్‌ను విజయం ఊరిస్తోంది. ఇంతకుముందు ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా రికార్డు ఛేదన ఎంతో తెలుసా..? 2001లో ట్రెంట్ బ్రిడ్జ్(Trent Bridge)లో జరిగిన టెస్టులో ఆఖరి రోజు కంగారు జట్టు 158 పరుగులు కొట్టింది.
ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించింది. ఇప్పటివరకు ఆసీస్‌కు అదే రికార్డు ఛేదన కావడం విశేషం. కానీ, ప్రస్తుతం ఆసీస్ బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. ఆ జట్టులోని మిడిలార్డర్ ఆటగాళ్లు ట్రావిస్ హెడ్(Travis Head), కామెరూన్ గ్రీన్(Cameron Green), అలెక్స్ క్యారీ సూపర్ టచ్‌లో ఉన్నారు. దాంతో, 174 టార్గెట్‌ను ప్యాట్ కమిన్స్ సేన ఈజీగా చేరుకునే అవకాశం లేకపోలేదు.
లబూషేన్, స్మిత్‌ను ఔట్ చేసిన బ్రాడ్‌కు సహచరుల అభినందన
నాలుగో రోజు ఇంగ్లండ్ 273 ఆలౌటయ్యింది. నాథన్ లియాన్(Nathan Lyon), ప్యాట్ కమిన్స్(Pat Cummins) నాలుగేసి వికెట్లతో ఆతిథ్య జట్టను వణికించారు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్(36), ఉస్మాన్ ఖవాజా(34 నాటౌట్) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే.. వార్నర్‌ను ఔట్ చేసి రాబిన్సన్ ఇంగ్లండ్‌కు బ్రేక్ ఇచ్చాడు. సీనియర్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ చెలరేగాడు. మార్నస్ లబూషేన్(13), స్టీవ్ స్మిత్(6)ను ఔట్ చేసి ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఖవాజా, నైట్‌వాచ్‌మన్ స్కాట్ బోలాండ్(13) మరో వికెట్ పడకుండా ఆడారు. ఇంకా.. ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. దాంతో, ఆసీస్ విజయంపై ధీమాగా ఉంది. అయితే.. ఐదోరోజు తొలి సెషన్ కీలకం కానుంది. అండర్సన్, బ్రాడ్, మోయిన్ అలీ.. విజృంభిస్తే మ్యాచ్ ఇంగ్లండ్ వైపు తిరుగుతుంది. అలాకాకుండా ఆసీస్ బ్యాటర్లు రెండు, మూడు భాగస్వామ్యాలు నిర్మిస్తే అలవోకగా గెలుస్తుంది.