నాటింగ్‌హామ్ : వింబుల్డన్ సన్నద్ధతలో భాగంగా ఆండీ ముర్రే నాటింగ్‌హామ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ టైటిల్ గెలుచుకున్నాడు. ఫైనల్లో ముర్రే 6-4, 6-4 స్కోరుతో ఫ్రెంచ్ ఆటగాడు ఆర్ధర్ కజాక్స్పై గెలుపొందాడు. ఇటీవల సర్బిటన్లో టైటిల్ నెగ్గిన ముర్రే పచ్చిక కోర్టులలో వరుసగా రెండో టైటిల్ గెలిచాడు.
మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత ముర్రే ఈ టోర్నీలో ఎదురులేని ప్రదర్శన చేసి నాలుగు బ్రేక్ పాయింట్లను సద్వినియోగం చేసుకున్నాడు. ఈ టోర్నీలో ఆడిన అయిదు మ్యాచ్‌లలో ముర్రే ఒక్క సెట్నుకూడా ప్రత్యర్థులకు కోల్పోలేదు. కాగా సోమవారం ఆరంభం కానున్న క్వీన్స్ క్లబ్ చాంపియన్‌షిప్‌లో ముర్రే తదుపరి టైటిల్ వేట కొనసాగించనున్నాడు.