ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు తగిన ప్రాధాన్యం ఇస్తుందని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 17వేలకు పైగా క్రీడా ప్రాంగణాలు, నియోజకవర్గానికో స్టేడియం నిర్మించినట్లు పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) టెక్నాలజీ కాలేజీ వార్షిక క్రీడా దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంజనేయగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘విద్యార్థులు క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలి. మెరుగైన ఆరోగ్యానికి ఆటలు దోహదం చేస్తాయి. ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలు నిర్మించి ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు’ అని అన్నారు. వివిధ క్రీడాంశాల్లో విజేతలను సాట్స్ చైర్మన్ అభినందించారు.