Sania Mirza : భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా(Sania Mirza) ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. భర్తతో విడాకుల తర్వాత జీవితాన్ని కొత్తగా చూస్తున్న ఆమె ఇన్స్టాగ్రామ్ వీడియోలే అందుకు సాక్ష్యం. ఒంటరితనాన్ని జయించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న సానియా.. ప్రస్తుతం దైవ చింతన మీద దృష్టి పెట్టింది. మతపరంగా ముస్లిం అయిన సానియా త్వరలోనే పవిత్రమైన హజ్(Hajj) యాత్రకు వెళ్లనుంది. జీవితకాలంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్లాలనుకున్న తన కల నిజమయ్యే రోజు కోసం ఆతృతగా ఉన్నట్టు సానియా తన తాజా పోస్ట్‌లో వెల్లడించింది.
‘ప్రియమైన దోస్తులు, సన్నిహితులు.. మీ అందరికీ ఓ న్యూస్. పవిత్రమైన హజ్ యాత్ర చేసే అవకాశం నాకు లభించింది. ఈ మహత్తర యాత్ర కోసం నేను సిద్ధమవుతున్నా. నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి. ఈ ఆధ్యాత్మిక జర్నీ పట్ల నేను కృతజ్ఞతా భావంతో ఉన్నాను.
అల్లా నా పొరపాట్లను క్షమించి.. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉంటాడని నమ్ముతున్నా. జీవితకాల మజిలీకి సిద్ధమవుతున్న నన్ను మీ ప్రార్థన సమయంలో గుర్తు తెచ్చుకోండి. నేను మరింత గొప్ప మనిషిగా, దయగల హృదయం గల వ్యక్తిగా తిరిగొస్తానని ఆశిస్తున్నా’ అని సానియా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
భారత టెన్నిస్‌లో సంచలనాలకు కేరాఫ్ అయిన సానియా.. కెరీర్లో ఆరు టైటిళ్లు గెలుపొందింది. మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో ట్రోఫీలతో చరిత్ర సృష్టించింది. పాక్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్‌తో ప్రేమలో పడిన సానియా మిర్జా అతడిని 2010లో పెండ్లి చేసుకుంది. అనంతరం పాకిస్థాన్‌లోని సియాల్ కోట్లో వీళ్ల వలీమా వేడుక జరిగింది. కొన్నాళ్లు దుబాయ్‌లో గడిపిన ఈ జంటకు 2018లో ఇజాన్(Izhaan) అనే కుమారుడు పుట్టాడు. అయితే.. గత కొంత కాలంగా వేరువేరుగా ఉంటున్న సానియా, షోయబ్ తమ పన్నెండేళ్ల వివాహబంధానికి ముగింపు పలికారు.
సానియా కంటే ముందు మాలిక్ అయేషా సిద్దిఖీ (Ayesha Siddiqui)ని 2002లో పెండ్లి చేసుకున్నాడు. అయితే.. 2010లో అయేషాతో వివాహ బంధానికి స్వస్తి పలికి సానియాను మనువాడాడు. ఇప్పుడు షోయబ్ పెండ్లి చేసుకున్న సనా ఒక ఉర్దూ టీవీ సీరియల్ నటి.