Saina Nehwal | భారత మహిళల బ్యాడ్మింటన్ (badminton) స్టార్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) సంచలన ప్రకటన చేశారు. బ్యాడ్మింటన్ ఆటకు వీడ్కోలు పలికారు. మహిళల బ్యాడ్మింటన్‌కు మార్గదర్శిగా నిలిచి ఎన్నో అత్యుత్తమ విజయాలు అందుకున్న సైనా.. తాను ఇక ఆడలేనని ఓ పాడ్‌కాస్ట్ వేదికగా తెలిపారు.
‘నేను రెండేళ్ల కిందటే ఆడటం ఆపేశాను. ఎంతో ఇష్టంతో నా అంతట నేను ఆటలోకి వచ్చా. ఇప్పుడు నా అంతట నేను నిష్క్రమిస్తున్నా. ఇంకెంతమాత్రం ఆడగలిగే సామర్థ్యం లేనప్పుడు కథ ముగిసినట్లే. ఇది సహజం. నా రిటైర్మెంట్ను ప్రకటించడం అంత పెద్ద విషయమని నేను అనుకోలేదు. అందుకే చెప్పలేదు. ఆటకు గుడ్‌బై చెప్పే సమయం ఇదే అని నాకు అనిపించింది. ఎందుకంటే మునుపటిలా నా మోకాళ్లు సహకరించడం లేదు.
ఆర్థరైటిస్ వచ్చింది.. కార్టిలేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. గతంలోలాగా ఎక్కువ సమయం తీవ్రమైన శిక్షణను తట్టుకోలేకపోయాను. అందుకే ఈ నిర్ణయం తప్పనిసరి అయింది. ఇక నేను ఆ స్థాయిలో ఆడలేనని నా తల్లిదండ్రులు, కోచ్‌లకు చెప్పాల్సి వచ్చింది. చాలా కష్టంగా ఉందని చెప్పాను. ఇంతకు ముందు రోజుకు 8 నుంచి 9 గంటలు శిక్షణ తీసుకునేదాన్ని. ఇప్పుడు గంట, రెండు గంటల్లోనే మోకాలు వాపు వచ్చేస్తోంది. అప్పుడు అనిపించింది.. ఇక చాలు. ఇంతకంటే నేను కష్టపడలేను అని. అందుకే ఆటకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాను’ అని సైనా చెప్పుకొచ్చింది.
Also Read..
నేటి నుంచి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్