లేహ్(లడఖ్): ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌కు వేళయైంది. మంగళవారం నుంచి లేహ్ వేదికగా వింటర్ గేమ్స్ మొదలుకాబోతున్నాయి. హిమాలయ పర్వత సానువుల్లో జరుగనున్న వింటర్ గేమ్స్‌లో ఈసారి వెయ్యి మందికి పైగా అథ్లెట్లు పోటీపడుతున్నారు. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తుకు తోడు ఆక్సిజన్ శాతం తక్కువ ఉండే ప్రాంతంలో జరుగనున్న ఈ గేమ్స్ కోసం అథ్లెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లేహ్‌లోని నవాంగ్ దోర్జాన్ స్టోబన్ స్టేడియంతో పాటు ఆర్మీ రింక్, గుపుక్ పాండ్..గేమ్స్‌కు ప్రధాన వేదికలు. మంగళవారం మధ్యహ్నం ప్రారంభ కార్యక్రమం జరుగనుంది. స్కేటింగ్, ఐస్ హాకీతో పాటు ఈసారి ఒలింపిక్ ఈవెంట్ అయిన ఫిగర్ స్కేటింగ్‌కు నిర్వాహకులు అవకాశం కల్పించారు.