Saina Nehwal : ఒలింపిక్ విజేతగా ఓ వెలుగు వెలిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆరేండ్లుగా అంతర్జాతీయ పోటీలకు దూరైమైన సైనా తాను ఆర్ధరైటిస్(Arthritis) సమస్యతో బాధ పడుతున్నాని ఈమధ్యే చెప్పింది. అంతకంటే ముందు ‘భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ చూస్తే అసూయ వేస్తోంది’ అంటూ ఆమె విమర్శల పాలైంది. అప్పటి నుంచి ఎవరోఒకరు సైనాను సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చింది.
ఈమధ్య కొందరు సైనా నెహ్వాల్ ప్రతిభను, కష్టాన్ని తక్కువ చేస్తూ మాట్లాడతున్నారు. పారిస్ ఒలింపిక్స్ సమయంలో కొందరు 2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం ఆమెకు అదృష్టవశాత్తూ.. బహుమతిగా దొరికిందంటూ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతున్నారు. దాంతో, చిర్రెత్తుకొచ్చిన సైనా వాళ్లకు గట్టిగా బుద్ది చెప్పాలనుకుంది. ‘ముందుగా ఒలింపిక్స్ పోటీలకు అర్హత సాధించండి. ఆ తర్వాత నన్ను విమర్శించండి’ అంటూ ఆమె సవాల్ విసిరింది. సైనా నుంచి ఊహించని స్పందన రావడంతో విమర్శకుల నోళ్లకు తాళం పడినట్టు అయింది.
దాదాపు ఆరేండ్లుగా ఆటకు దూరమైన సైనా ఈ మధ్య రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము (Droupadi Murmu)తో సరదాగా బ్యాడ్మింటన్ ఆడింది. అనంతరం ‘మై స్టోరీ – హర్ స్టోరీ’ సిరీస్‌లో ఆమె పలు విషయాలు మాట్లాడింది. అయితే.. క్రికెట్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. బ్యాడ్మింటన్ బదులు టెన్నిస్ ఆడి ఉంటే బాగుండు అని తనకు అప్పుడప్పుడు అనిపించేదని సైనా అంది.
అంతేకాదు ‘టెన్నిస్, బ్యాడ్మింటన్ కంటే క్రికెట్ ఏమంత కష్టమేమీ కాదు. మనదేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ చూస్తే అసూహ వేస్తుంది. ఎందుకంటే.. క్రికెట్‌కు మాత్రమే క్రేజ్ ఉంటే భారత్ క్రీడా దేశం ఎలా అవుతుంది?. ఒలింపిక్స్‌లో చైనాతో పోటీ పడి పతకాలు ఎలా గెలవగలం’ అని అంది.