Sachin Tendulkar : క్రికెట్ గాడ్‌గా పేరొందిన సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) ఆటపై చెరగని ముద్ర వేసిన విషయం తెలిసిందే. రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్‌ను శాసించిన ఈ దిగ్గజం ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. సూపర్ టెక్నిక్, అబ్బురపరిచే కవర్ డ్రైవ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనసులు గెలుచుకున్నాడు. వరల్డ్ చాంపియన్(World Champion)గా కెరీర్‌కు వీడ్కోలు పలికిన సచిన్ వన్డేల్లో తిరుగులేని రికార్డులు నెలకొల్పాడు. అయితే.. ఈ ఫార్మాట్లో అతడి సెంచరీల ప్రస్థానం మొదలైంది మాత్రం ఈ రోజే. క్రికెట్లో ఒక సరికొత్త చరత్రకు నాంది పలికిన ఈరోజును బీసీసీఐ(BCCI) గుర్తు చేసుకుంది. సచిన్ సెంచరీ ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
సరిగ్గా 29 ఏళ్ల క్రితం.. 1994 సెప్టెంబర్ 9న లిటిల్ మాస్టర్ 50 ఓవర్ల ఫార్మాట్లో మూడంకెల స్కోర్ అందుకున్నాడు. ఆస్ట్రేలియాపై 130 బంతుల్లో 110 పరుగులు సాధించాడు. అప్పటికే దిగ్గజ బౌలర్లను ఉతికారేసిన సచిన్ వన్డేల్లో సెంచరీ కోసం ఐదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. అవును.. 1989 డిసెంబర్ 18న ఈ ఫార్మాట్లో అరంగ్రేటం చేసిన లిటిల్ మాస్టర్ 79వ వన్డేల్లో శతకంతో మెరిశాడు.
వన్డేల్లో తొలి సెంచరీ కొట్టాక సచిన్ అభివాదం
🗓️ #OnThisDay in 1994,
The legendary @sachin_rt scored his Maiden ODI century and the rest is history! 👏👏#TeamIndia pic.twitter.com/jsg8MJNxiR
— BCCI (@BCCI) September 9, 2023
అంతర్జాతీయ క్రికెట్లో మరెవరికీ సాధ్యం కాని రీతిలో సచిన్ వంద సెంచరీలు బాదాడు. ముఖ్యంగా తనకు ఎంతో అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్లో రికార్డు స్థాయిలో 49 శతకాలు, 96 అర్ధ శతకాలు బాదాడు. అంతేకాదు వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ(Double Century) కొట్టింది కూడా సచినే. 2010లో దక్షిణాఫ్రికా(South Africa)పై శివాలెత్తిన మాస్టర్ బ్లాస్టర్ 200 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఏళ్లుగా ఊరిస్తున్న ప్రపంచ కప్ ట్రోఫీ కలను 2011లో నిజం చేసుకున్నాడు. ఆ ఏడాది సొంత గడ్డపై జరిగిన మెగా టోర్నీలో ఎంఎస్ ధోనీసేన విజేతగా నిలిచింది. క్రికెట్ గాడ్‌కు ప్రపంచ కప్ ట్రోఫీని గొప్ప కానుకగా అందించింది. టీమిండియా తరఫున 200 టెస్టులు ఆడిన ఈ లెజెండ్ 15,921 పరుగులు చేశాడు. 463 వన్డేల్లో 18,426 రన్స్ కొట్టాడు.
2013లో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్రాంచైజీ మెంటార్‌గా సేవలందిస్తున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్లో సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) ఇదే జట్టు తరఫున బరిలోకి దిగాడు. దాంతో, ఒకే ఐపీఎల్ జట్టుకు ఆడిన మొదటి తండ్రీకొడుకులుగా సచిన్, అర్జున్ రికార్డు సృష్టించారు.