Kapalbhati | మన దేశంలో యోగాకు చాలా ప్రాధాన్యత ఉంది. యోగా అంటే కేవలం కొన్ని భంగిమలను పునరావృతం చేయడం కాదు. జీవితంలో ఉండే సూక్ష్మశక్తులను గుర్తించడం. ప్రశాంతంగా కూర్చుని నుదుటి మధ్య దృష్టిని కేంద్రీకరించనప్పుడే మనం ఈ సూక్ష్మ శక్తులను గుర్తించగలుగుతాం. శరీరాన్ని, మనస్సును ఏకం చేయడానికి యోగాకు మించిన సాధన లేదు. నిశ్చలతను అభ్యసించినప్పుడే మనం శరీరాన్ని, మనసును ఏకం చేయగలం. నిశ్చలంగా ఉండి, శ్వాస తీసుకుంటూ, అసమతుల్యతను దూరం చేస్తూ చేసే యోగా సాధనాల్లో కపాలభాతి ఆసనం కూడా ఒకటి. మన శరీరానికి, మనసుకు గొప్ప అనుభూతిని ఇచ్చే ఆననాల్లో ఇది ఒకటి. ఈ ఆసనం వేయడం కూడా చాలా సులభం. దీనిని యోగా ఆసనం అనడం కంటే శ్వాస వ్యాయామం అనడం మంచిది. ఈ ఆసనం వేయడం వల్ల ముఖంపై సహజ కాంతి వస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఈ ఆనసం వేయడం వల్ల శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కపాలభాతి ఆసనం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి యోగా నిపుణులు వివరిస్తున్నారు.
కపాలభాతి ఆనసం వేయడం వల్ల పొట్ట ఎక్కువగా కదులుతుంది. ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసల కారణంగా పొట్ట కదలడం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కాలేయం, క్లోమం దాని చుట్టూ ఉండే కండరాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయా అవయవాలకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
కపాలభాతి ఆసనం వల్ల కడుపులో గ్యాస్ సమస్య తగ్గుతుంది. కడుపులో అధిక ఆమ్లత్వం కారణంగా తలెత్తే సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. పొట్ట చుట్టూ అధిక కొవ్వు సమస్యతో బాధపడే వారు కపాలభాతి ఆసనం వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆసనం వేయడం వల్ల పొట్ట చుట్టూ అధికంగా ఉండే కొవ్వు వేగంగా కరుగుతుంది.
కపాలభాతి ఆసనం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఈ ఆసన సాధన వల్ల గుండె, ఊపిరితిత్తుల్లో ఉండే అడ్డంకులు తొలగించబడతాయి. దీని వల్ల శరీరంలో రక్తప్రసరణ వేగం పెరుగుతుంది. బద్దకం తగ్గి శరీరంలో ఉత్తేజంగా ఉంటుంది. కపాలభాతి ఆసనం వల్ల ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది. ఈ ఆసనాన్ని తరచూ సాధన చేయడం వల్ల మెదడు కణాలు ఉత్తేజంగా తయారవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. మతిమరుపు వంటి సమస్యలు తగ్గుతాయి. కపాలభాతి ఆసనం వల్ల ఆధ్యాత్మిక ఫలితాలు కూడా కలుగుతాయి. ఈ ఆసనం శరీరంలోని చక్రాలను సక్రియం చేస్తుంది. ఇది శరీరానికి గొప్ప మేల్కొలుపును ఇస్తుంది.
ఇలా మన మొత్తం శరీరానికి కపాలభాతి ఆనసం మేలు చేస్తుందని దీనిని తరచూ సాధన చేయడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. అయితే నడుము సమస్యలు, అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడే వారు నిపుణుల పర్యవేక్షణలో ఈ ఆసనాన్ని సాధన చేయాలి. అలాగే ఈ ఆసనాన్ని ఉదయం పూట చేయవచ్చు లేదా ఉదయం అల్పాహారం తీసుకున్న మూడు గంటల తరువాత కూడా చేయవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.