మేడ్చల్, మార్చి14(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. బుకింగ్‌లో ఆంక్షలు.. డెలివరీలో జాప్యంతో వినియోగదారులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించడం వల్లే సరఫరాలో ఇబ్బందులు వస్తున్నట్లు కస్టమర్లు ఆరోపిస్తున్నారు. గృహ అవసరాల సిలిండర్ ధర పెరగడంతో పాటు బుకింగ్లోనూ ఆంక్షలు విధించారు. గతంలో సిలిండర్ బుక్ చేసిన తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల్లో ఇంటికి చేరేది. ప్రస్తుతం వారం గడిచినా సిలిండర్ డెలివరీ కావడం లేదని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సిలిండర్లు ఆన్లైన్లో బుకింగ్ కాకపోవడంతో నేరుగా గ్యాస్ ఏజెన్సీల వద్దకు వినియోగదారులు వచ్చి బుకింగ్‌లు చేయమని కోరుతున్నారు. ఇదిలా ఉంటే వాణిజ్య సిలిండర్లకు బ్రెక్ పడిన నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమల యజమానులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటళ్లు, రెస్టారెంట్లపై ప్రభావం పడే అవకాశమున్నది. అనేక మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.
జిల్లాలో 6,11,118 గ్యాస్ కనెక్షన్లు
మేడ్చల్ జిల్లాలో 6, 11, 118 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 52 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా సిలిండర్ల పంపిణీ జరుగుతున్నది. అయితే వాటి డెలవరీలో ఆటంకాలు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కాగా, ఇప్పటికే సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలించడం వల్లే వినియోగదారులకు సరఫరాలో ఇబ్బందులు పడుతున్నట్లు ఇప్పటికే ఫిర్యాదులు వస్తున్నాయి. కాగా, గృహ అవసరాల వినియోగదారులు సిలిండర్ల డెలవరీలో ఇబ్బందులు ఏర్పడితే సమాచారం అందించేందుకు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. గ్యాస్ సరాఫరాలో ఇబ్బందులతో పాటు సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు సమాచారం ఉంటే 040-29700820ను సంప్రదించాలని సూచించారు. గ్యాస్ ఏజెన్సీల నుంచి సరఫరా చేసే సిలిండర్లను ప్రతి రోజూ ఆర్డీవోలు, తహసీల్దార్లు, అసిస్టెంట్ సివిల్ అధికారులు పర్యవేక్షించేలా జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు.