అంబర్‌పేట, మార్చి 14 : లాంగ్ డ్రైవ్ కార్స్లో ఓ కారును కిరాయికి తీసుకొని రాజస్థాన్ కు చెందిన వ్యక్తికి విక్రయించిన కేసులో ఐదుగురిని నల్లకుంట పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కారును స్వాధీనం చేసుకున్నారు. నల్లకుంట పీఎస్‌లో మీడియాతో మాట్లాడుతు ఓయూ ఏసీపీ జి. జగన్ వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ ఇందర్పురా గ్రామానికి చెందిన ప్రభు దయాళ్ సైనీ(28) సికార్‌లో గల ఈశ్వర్ గ్యారేజీలో ప్రింటింగ్ అండ్ డెంటింగ్ పని చేస్తున్నాడు. ఆ గ్యారేజీకి ఒక మహీంద్రా ఎక్యూవీ 300, కారు నెంఃయూపీ 16సిడి3717 కారు స్క్రాప్ కింద వచ్చింది. దీన్ని గమనించిన ప్రభు దయాళ్ సైనీ బ్యాంక్ డిఫాల్టర్స్ నుంచి ఒక మహీంద్రా ఎక్యూవీ 300 కారును కొనుగోలు చేయాలనుకొని స్క్రాప్‌నకు వచ్చిన కలర్, మోడల్ కారును మాత్రమే కొనాలనుకున్నాడు. దీనికోసం ప్రభు దయాళ్ సైనీ ఫేస్బుక్లో పెట్టాడు.
గుగూల్ లో వెతుకగా.. హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన ఎండీ ఆసిఫ్ తాను కారు ఇప్పిస్తానని పరిచయం చేసుకున్నాడు. ఎండీ ఆసిఫ్, అతని స్నేహితుడు ఉజైర్ ఇద్దరు కలిసి హైదరాబాద్‌లో ఒకే కలర్, ఒకే మోడల్, మహీంద్రా ఎక్యూవీ 300 కారు కోసం సర్చ్ చేయగా, నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సిరిసంపద అపార్ట్మెంట్లో ఉండే నాగలింగేశ్వరరెడ్డి నిర్వహించే లాంగ్ డ్రైవ్ కార్స్ లో అదే రంగు, మోడల్ కారు కనిపించింది. దీంతో ఆసిఫ్, ఉజైర్ ఇద్దరు కలిసి మదీనా హోటల్ దగ్గర గల బాబానగర్‌కు చెందిన వీరి దోస్తు షేక్ జాఫర్ అహ్మద్ అలియాస్ ఫైజల్ కు విషయం తెలిపారు. ఆ కారు బుక్ చేయాలని చెప్పారు. షేక్ జాఫర్ అహ్మద్ ఆ కారును కిరాయికి బుక్ చేయడానికి ఫలక్నామా, అచ్చిరెడ్డినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ వాసీమ్, డ్రీమ్ సిటి, బాలాపూర్‌కు చెందిన ఖాజా జాబెఉద్దీన్(స్టూడెంట్)లను సంప్రదించాడు. ఈ ఇద్దరు ఒప్పుకోకపోతే రూ.20వేలు ఇస్తానని చెప్పి ఒప్పించారు.
ఫిబ్రవరి 25వ తేదీన వాసీమ్, ఖాజా జాబేఉద్దీన్ ఇద్దరు కలిసి నల్లకుంట లో ఉండే లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వహించే నాగలింగేశ్వరరెడ్డి దగ్గరకు వచ్చారు. వాసీమ్ తన ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ కాఫీలు నాగలింగేశ్వరరెడ్డికి ఇచ్చి మహీంద్రా ఎక్యూవీ 300 మోడల్కారును తీసుకొని వెళ్లారు. రెండు రోజులైనా తిరిగి కారును తీసుకురాలేదు. ఫోన్ చేస్తే సెల్ స్విఛ్చాప్ వస్తుంది. దీంతో అనుమానం వచ్చి నల్లకుంట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ కేసును ఛేదించారు. కారును అద్దెకి తీసుకున్న ఎండీ వాసీమ్ ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను తీసుకొన్నారు.
వాసీం, ఖాజా జాబె ఉద్దీన్ వచ్చిన ద్విచక్ర వాహనం నెంబర్ ఆధారంగా పాతబస్తీకి వెళ్లి వారి ఫోటోలు సేకరించారు. వారి ఇంటి అడ్రస్‌ను వెతికి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా షేక్ జాఫర్ అహ్మద్, ఉజైర్, ఎండీ ఆసిఫ్‌లు చెప్పడంతో తాము ఆ కారును కిరాయికి తీసుకున్నామని పోలీసులకు చెప్పారు. పోలీసులు వారి ఫోన్ డాటాల ఆధారంగా ఎండీ ఆసిఫ్‌ను పట్టుకొని విచారించారు. మహీంద్రా ఎక్యూవీ 300 కారును ప్రభు దయాళ్ సైనీకి రూ.2.10 లక్షలకు విక్రయించామన్నారు. బోయినిపల్లిలో ఈ విక్రయం జరిగిందని వచ్చిన డబ్బులను పంచుకున్నారు. సమావేశంలో నల్లకుంట ఇన్స్పెక్టర్ కాసుల మారుతీ ప్రసాద్, అడ్మిన్ ఎస్సై వరలక్ష్మి, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.