Sergio Jimenez : సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం పిచ్చి పనులు చేయడం చూస్తూనే ఉంటాం. దీని కోసం కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు కూడా తెలుసు. తాజాగా స్పెయిన్ లో ఇలాగే ఒక ఇన్ఫ్లుయెన్సర్.. వ్యూయర్స్ ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా జరిగింది. స్పెయిన్ కు చెందిన సెర్గియో జిమెనెజ్ అనే 37 ఏళ్ల వ్యక్తి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరు తెచ్చుకున్నాడు.
వ్యూయర్ షిప్ తోపాటు, వ్యూయర్స్ పే చేసే డబ్బుల కోసం రకరకాల ఛాలెంజ్ లు స్వీకరిస్తుంటాడు. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా ఒక లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. దీంట్లో పెయిడ్ వ్యూయర్స్ కోసం లైవ్ లో ఒక ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాడు. అదే లైవ్ లో కొకైన్ తీసుకుని, విస్కీ తాగడం. స్ట్రీమింగ్ ద్వారా వచ్చే డబ్బుల కోసం అతడు లైవ్ లో ఆరు గ్రాముల కొకైన్ తీసుకున్నాడు. అంతేకాదు.. ఒక ఫుల్ విస్కీ బాటిల్ తాగాడు. దీంతో అతడు కొద్దిసేపట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. అతడి తల్లి అర్ధరాత్రి వచ్చి చూసేసరికి సెర్గియో బెడ్ పై పడి ఉన్నాడు. ఎంతకీ లేవకపోవడంతో అతడు మరణించినట్లు గుర్తించి పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సెర్గియో గతంలో కూడా ఇలా లైవ్ స్ట్రీమింగ్ లో డబ్బుల కోసం డ్రగ్స్ తీసుకున్నాడు.
అయితే, ఈ పరిణామంపై అక్కడి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి ఛాలెంజ్ లు యాక్సెప్ట్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని హెచ్చరిస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. గతంలో కూడా కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి ఛాలెంజ్ లు చేసి మరణించిన ఘటనలున్నాయి.