Demolition : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని రామ్‌లీలా మైదానం దగ్గర ఉన్న సయ్యద్ ఫయాజ్ ఇలాహీ (Syed Faiz Elahi) మసీదు వద్ద బుధవారం ఉదయం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మసీదు ఆవరణలో ఆక్రమణలను కూల్చివేసేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులు, పోలీస్ టీమ్స్‌పై 25-30 మంది స్థానికులు రాళ్లు విసిరారు. దాంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
స్థానికులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణల్లో ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు నిందితుల్లో ఐదుగురిని అరెస్ట్ చేశారు. కాగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకే అధికారులు ఇవాళ ఆక్రమణల కూల్చివేత కార్యక్రమం చేపట్టారు. తుర్క్‌మాన్ గేట్ సమీపంలోని రామ్‌లీలా మైదానం ఏరియాలో ఆక్రమణలకు గురైన 39 వేల చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేయించాలని ఢిల్లీ హైకోర్టు గత ఏడాది నవంబర్‌లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను అదేశించింది.
దాంతో మున్సిపల్ ఆక్రమదారులకు నోటీసులు జారీచేశారు. ఆ నోటీసులు సవాల్ చేస్తూ మసీదు మేనేజ్మెంట్ కమిటీ హైకోర్టులో పిటిషన్ వేసింది. తాము ఆక్రమించామంటున్న భూమి వక్ఫ్ భూమి అని, ఈ భూమికి సంబంధించిన వివాదాలను పరిష్కరించే హక్కు కేవలం వక్ఫ్ ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉంటుందని తన పిటిషన్లో పేర్కొంది. అయితే ఆక్రమణలకు గురైన భూమిలో మొత్తం వక్ఫ్ ల్యాండ్ కాదని, అందులో కేవలం 0.195 ఎకరాలు మాత్రమే వక్ఫ్ ల్యాండ్ అని మున్సిపల్ అధికారులు కోర్టుకు తెలిపారు.
దాంతో 0.195 ఎకరాల ల్యాండ్ మినహా మిగతా ల్యాండ్‌లో ఆక్రమణలను తొలగించాలని కోర్టు
సూచించింది. దాంతో మిగతా ఆక్రమణల తొలగింపుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ అదేస్థలంలో ఉన్న శ్మశానానికి గౌరవం ఇచ్చి, దాని తొలగింపును ఆపాలని మసీదు కమిటీ కోర్టును కోరింది. ఈ క్రమంలో మసీదు కమిటీ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. దాంతో కోర్టు నాలుగు వారాల్లో స్పందన తెలియజేయాని ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్, పట్టణాభివృద్ధి శాఖ, ఢిల్లీ వక్ఫ్ బోర్డులను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.