Ruturaj Gaikwad : ఐపీఎల్లో ఆల్‌టైమ్ ఫేవరెట్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు పదహారో సీజన్ చాంపియన్‌గా నిలిచింది. ఐదోసారి టైటిల్ సాధించి ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ యంగ్ ఓపెనర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఫైనల్ అనంతరం అతను కాబోయే భార్యను జట్టు సభ్యులకు పరిచయం చేశాడు. ఐపీఎల్ ట్రోఫీ పట్టకుని ఇద్దరూ ఫొటోలకు పోజిచ్చారు కూడా.
ఇంతకు ఆమె ఎవరంటే..? గైక్వాడ్ గర్ల్‌ఫ్రెండ్. పేరు.. ఉత్కర్ష అమర్ పవార్(Utkarsha Amar Pawar). సొంతూరు పుణే. అన్నట్టు ఆమె కూడా క్రికెటరే. 11 ఏళ్ల వయసు నుంచే క్రికెట్‌పై ఇష్టం పెంచుకుంది. పేస్ బౌలర్ అయిన ఉత్కర్ష మహరాష్ట్ర మహిళా క్రికెట్ టీమ్‌కు ఆడింది. దేశవాళీలో 10 మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు పడగొట్టింది. ప్రస్తుతం పుణేలోని న్యూట్రిషన్, ఫిట్నెస్ సైన్స్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటోంది.
రుతురాజ్, ఉత్కర్ష రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే.. ఈ విషయం బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. వీళ్ల ప్రేమ విషయం తెలిసిన ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. దాంతో, జూన్ మొదటి వారంలో రుతురాజ్, ఉత్కర్ష వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. అందుకనే ఈ యంగ్ ఓపెనర్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ స్టాండ్ బై ప్లేయర్‌గా తప్పుకున్నాడు. అతడి ప్లేస్‌లో యశస్వీ జైస్వాల్ ఎంపికయ్యాడు. 16వ సీజన్లో దంచికొట్టిన యశస్వీ టెస్టుల్లో అవకాశం వస్తే సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. గైక్వాడ్ ఈ సీజన్లో డెవాన్ కాన్వేతో కలిసి సీఎస్కేకు శుభారంభాలు ఇచ్చాడు. 16 మ్యాచుల్లో 42.14 సగటుతో 590 పరుగులు చేశాడు. అంతేకాదు ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 9 సిక్స్‌లు బాదాడు. కాన్వే, గైక్వాడ్ ఓపెనింగ్ జోడీ 849 రన్స్ కొట్టింది.