IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ నుంచి వైదొలిగిన రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) విచారం వ్యక్తం చేశాడు. అనుకోకుండా ఎడిషన్ మొత్తానికి దూరం కావడం బాధగా ఉందని అన్నాడు. అయితే.. ధోనీ(MS Dhoni) కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్(CSK) పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడీ మాజీ కెప్టెన్. రుతురాజ్ తన గాయం గురించి.. ధోనీ సారథ్యం గురించి మాట్లాడిన వీడియోను చెన్నై ఫ్రాంచైజీ శుక్రవారం తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో గైక్వాడ్ ఏమేం విషయాలు చెప్పాడంటే..?
ఐపీఎల్ నుంచి నిష్క్రమించినందుకు మీకే కాదు నాకూ చాలా బాధగా ఉంది. మోచేతి గాయం కారణంగా నేను తప్పుకోవాల్సి వచ్చింది. ఈ కష్ట సమయంలో నాకు మద్దుతుగా నిలుస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. మీ ప్రేమతో నేను త్వరగా కోలుకుంటాను. ఈ సీజన్ మాకు చాలా సవాల్ విసురుతోంది. నాలుగు మ్యాచుల్లో ఓడిపోయాం. అయితే.. మాకు అన్క్యాప్డ్ ప్లేయర్ అయిన ధోనీ రూపంలో చురుకైన వికెట్ కీపర్ ఉన్నాడు. ఇకపై అతడే జట్టును నడిపించనున్నాడు. మహీ భాయ్ సారథ్యంలో మా జట్టు పుంజుకొని విజయాల బాట పడుతుందనే నమ్మకం నాకుంది. నేను డగౌట్లో ఉండి మా సహచరులను ప్రోత్సహిస్తాను. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న సీఎస్కేకు పూర్వ వైభవం తేవాలని ఉంది.
Straight from Rutu’s soul! 🤳💛📹#WhistlePodu #AllYouNeedIsYellove 🦁💛 pic.twitter.com/PNIZBWR1yR
— Chennai Super Kings (@ChennaiIPL) April 10, 2025
అయితే.. పరిస్థితులు మన చేతుల్లో ఉండవు కదా. అందుకే.. మా జట్టు సభ్యులకు ఆత్మవిశ్వాసంగా ఉండాలని చెబుతున్నా. తాలా నాయకత్వంలో చెలరేగిపోవాలని.. ఈ సీజన్‌కు చక్కని ముగింపు పలకాలని ఆశిస్తున్నా అని రుతురాజ్ వెల్లడించాడు. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఆర్చర్ విసిరిన బంతి గైక్వాడ్ ఎడమ మోచేతికి బలంగా తాకింది. దాంతో, ఎముక విరిగినట్టు ఎక్స్-రే, ఎంఆర్ఐ స్కానింగ్‌లో బయటపడింది. ఫలితంగా.. నెల రోజులకు పైగా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అందువల్ల.. గైక్వాడ్ కెప్టెన్సీతో పాటు సీజన్ మొత్తానికి దూరం కావాల్సి వచ్చింది.
పదిహేడో సీజన్ ముందు రుతురాజ్‌కు పగ్గాలు అప్పగించిన ధోనీ.. మళ్లీ సారథిగా వ్యవహరించనున్నాడు. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో మహీ చెన్నై సారథిగా టాస్కు రానున్నాడు. తద్వారా ఐపీఎల్లో అత్యధిక వయస్కుడైన కెప్టెన్‌గా ధోనీ రికార్డు నెలకొల్పనున్నాడు. ఈ సీజన్లో 180 ప్లస్ టార్గెట్ అంటే చాలు డీలా పడిపోతున్న సీఎస్కే.. వరుసగా 4 మ్యాచుల్లో చిత్తుగా ఓడింది. అలాంటి జట్టును విజయాల బాట పట్టించడం ధోనీకి కత్తిమీద సామేనని అంటున్నారు విశ్లేషకులు.
CAPTAIN MAHENDRA SINGH DHONI 🦁7️⃣#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/H3Wqm6AdGt
— Chennai Super Kings (@ChennaiIPL) April 10, 2025